ఆ రెండు చోట్ల త్వరగా.. ఆ 4 చోట్ల ఆలస్యంగా ఫలితాలు
సార్వత్రిక ఎన్నికల సందడి చివరి దశకు చేరుకుంది. కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 31 May 2024 5:08 AM GMTసార్వత్రిక ఎన్నికల సందడి చివరి దశకు చేరుకుంది. కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణతో పోలిస్తే ఏపీలో వెల్లడయ్యే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో పాటు.. గతంలో ఎప్పుడూ లేనంత పోటాపోటీగా.. తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఈ వాదనకు బలం చేకూరేలా పోలింగ్ ముగిసిన తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.
ఇదిలా ఉంటే.. జూన్ నాలుగున వెలువడే తుది ఫలితాలపై ఇప్పుడు అందరి చూపు ఉంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలు కావటంతో.. ప్రతిస్థానం విలువైనదే. ప్రతి రౌండ్ ప్రతిష్ఠాత్మకమైనదే. ఇక.. ఫలితాల విషయానికి వస్తే ముందుగా ఫలితం వచ్చే నియోజకవర్గం ఏమిటి? ఆలస్యంగా వెల్లడయ్యే నియోజకవర్గం ఏమిటి? అన్న చర్చ మొదలైంది. ఓట్ల ఆధారంగా లెక్కింపు ఉండటం.. ఎక్కువ ఓట్లు ఉంటే ఫలితం ఆలస్యంగా వెల్లడి కానుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కొన్ని నియోజకవర్గాల్లో ఫలితం ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని గంటల్లోనే వెల్లడి కానుండగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో రాత్రి వరకు ఫలితం వెల్లడి కాదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా నియోజకవర్గాలు ఏమిటన్నది చూస్తే..
ఏపీలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాలతో పోలిస్తే ముందుగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ).. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు మొదట వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముందే ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. దీనికి కారణం.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కేవలం 13 రౌండ్లలోనే ఉండటం.
రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. దీంతో.. ఈ నియోజకవర్గాల్లో ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోనే పూర్తి అవుతాయని భావిస్తున్నారు. అంటే.. మెజార్టీ నియోజకవర్గాల తుది ఫలితాలు వెల్లడి కానుండటంతో.. మధ్యాహ్నం పన్నెండు గంటల నాటికే అధిక్యతల మీద స్పష్టత రానుందని చెప్పాలి. 60 నియోజకవర్గాల్లో మాత్రం పాతిక రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో.. ఈ నియోజకవర్గాల్లో ఫలితాలు సాయంత్రానికి వెల్లడయ్యే వీలుంది.
ఇక.. నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం అత్యధికంగా 29 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో.. ఈ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం తుది ఫలితం రాత్రికి కానీ తేలని పరిస్థితి. ఒక అంచనా ప్రకారం ఈ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం రాత్రి 7 గంటల తర్వాతే పలితం వెలువడుతుందని చెబుతున్నారు. ఇంతకూ ఆ నాలుగు నియోజకవర్గాలేమిటన్నది చూస్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి.. రంపచోడవరం (ఎస్టీ).. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని భీమిలి నియోజకవర్గాలు చెప్పాలి. రంపచోడవరం.. చంద్రగిరిలో 29 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపుసాగితే.. పాణ్యం.. భీమిలిలో మాత్రం పాతిక రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు ఉంది. అంటే.. చంద్రగిరి.. రంపచోడవరం ఫలితాలు వెల్లడి కావటానికి కాస్త ముందుగా భీమిలి.. పాణ్యం ఫలితాలు వెల్లడి కానున్నాయి.