ఈసారి ఏపీ గెలవాలి !
By: Tupaki Desk | 4 Jun 2024 1:32 AM GMTఇది సగటు జనం కోరిక. ఏపీలో అయిదు కోట్లకు పైగా జనాభా ఉంది. ఒకనాడు తెలంగాణ తో కలుపుకుని ఉమ్మడి ఏపీలో ముక్కోటి తెలుగు వారు ఉండేవారు. ఇపుడు ఒక్క తెలంగాణాలోనే ఆ జనాభా ఉంది. 1982లో అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టినపుడు ఆరు కోట్ల జనాభా ఉమ్మడి ఏపీలో ఉండేది. ఇపుడు అది కాస్తా మరో రెండు కోట్లు పై దాటి పెరిగింది.
ఏపీ వరకూ చూస్తే విభజన తరువాత పరిస్థితి దారుణంగా మారింది. రెండు సార్లు ఎన్నికలు జరిగి రెండు ప్రభుత్వాలు వచ్చాయి. రెండు పార్టీలనూ జనాలు నెత్తికెత్తుకున్నారు. వారు కాకపోతే వీరితో అయినా పని జరుగుతుందని విశ్వసించారు. కానీ ఏపీ విభజన తరువాత గాయాలతో ఎలా ఉందో అంతకు మించి అన్నట్లుగా పరిస్థితి ఉంది.
దానికి కారణం విభజన కష్టాలతో పాటు రాజకీయంగానూ ఇబ్బందులు అని చెప్పాలి. అధికార విపక్ష పార్టీలు కలసికట్టుగా పనిచేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏపీలో మాత్రం మచ్చుకైనా ఆ జాడ కనిపించడం లేదు. దీని వల్ల కేంద్ర పార్టీలకు చాన్స్ దొరుకుతోంది.
తాజాగా జరిగిన ఎన్నికల్లో సైతం ఏపీలోని పార్టీలే ఒకరిని ఒకరు దూషించుకున్నాయి. కానీ ఏపీని గత పదేళ్ళుగా తీరని అన్యాయం చేసిన బీజేపీని పల్లెత్తు మాట అనలేకపోయాయి. లక్షలాది కోట్లు ఏపీకి రావాల్సి ఉంది. విభజన వల్ల రావాల్సినవి అన్నీ తెచ్చుకోవాలంటే ఏపీలోని మొత్తం 175 మంది ఎమ్మెల్యేలూ ఒక్కటిగా పోరాడాలి.
అధికార పక్షం అయినా విపక్షం అయినా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. విభజన తరువాత దశాబ్ద కాలం ఊరికే పోయింది. రాజకీయాలకే పరిమితం చేసుకుంటూ రాష్ట్రాన్ని వదిలేశారు అన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి అలా కాకుండా గెలిచిన వారు అలాగే ఓడిన వారు అంతా కూడా ఒక్క మాట మీద నిలిచి ఏపీ హక్కుల కోసం ఉద్యమించాలి. కేంద్రానికి ఈ విషయాల మీదనే షరతులు పెట్టి మరీ మద్దతు ఇవ్వాలి.
రానున్న అయిదేళ్ళలో రాజధాని పోలవరం పూర్తి కావాలి. అలాగే ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోవాలి. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కొత్త పరిశ్రమలు రావాలి. ముగిసిన అధ్యాయంగా ఉన్న ప్రత్యేక హోదా కూడా సాధించాలి. అలా ఏపీని గెలిపించేందుకు అన్ని పార్టీలు కంకణం కట్టుకోవాలి.
లేకపోతే ఏపీ మరో అయిదేళ్ళ తరువాత పాతిక లక్షల కోట్ల అప్పుతో 2029 ఎన్నికల వేళకు ఎలా ఉంటుంది అన్నది కూడా ఊహించేందుకే భయమేసే పరిస్థితి ఉంది అని అంటున్నారు. వీటి కంటే ముందు ఇకనైనా ప్రతీకార రాజకీయాలకు అంతా కలసి స్వస్తి పలకాల్సి ఉంది. రాజకీయాలను అలాగే చూడాల్సిన అవసరమూ ఉంది. ఇదే కోట్లాది జనం తీర్పు వెనక అసలైన అర్ధంగా అంతా అంటున్నారు.