తెలంగాణా ప్రజలకు ఆంధ్రా రాజకీయాలు అంత ఇష్టమా...?
రెండు తెలుగు రాష్ట్రాలు పదేళ్ల క్రితం ఒక్కటిగానే ఉన్నాయి. పైగా వారూ వీరూ కలిసే ఉంటున్న నేపధ్యం ఉంది
By: Tupaki Desk | 13 March 2024 3:30 PM GMTరెండు తెలుగు రాష్ట్రాలు పదేళ్ల క్రితం ఒక్కటిగానే ఉన్నాయి. పైగా వారూ వీరూ కలిసే ఉంటున్న నేపధ్యం ఉంది. ఉద్యోగ ఉపాధి రాజకీయ అవసరాల కోసం ఇటు వైపు వచ్చేవారు ఉన్నారు. అలా ఇతర సంబంధ బాధవ్యాలు కొనసాగుతున్నాయి. దాంతో తెలంగాణాలో ఎన్నికలు అయితే ఏపీలో ఆసక్తి ఉంటుంది. అదే విధంగా ఆంధ్రాలో ఎన్నికలు అంటే తెలంగాణా జనం కూడా ఇష్టంగా అన్నీ గమనిస్తారు అని అంటున్నారు.
తెలంగాణా వరకూ చూస్తే ప్రధాన ఎన్నికలు ముగిసాయి. మూడు నెలల క్రితం ఉత్కంఠభరితంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాంట్లో హోరా హోరీ పోరు సాగి బీఆర్ ఎస్ ఓడి కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇంక ఇపుడు తెలంగాణాలో ఎంపీ ఎన్నికలు మిగిలి ఉన్నాయి.
దాంతో తెలంగాణాలో ఇపుడు ఎక్కడ చూసినా ఆ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల గురించి చర్చ సాగడంలేదు. ఏపీలో ఇపుడు ఎలా ఉంది అన్న దాని మీదనే మాట్లాడుకుంటున్నారు. పెద్ద ఎత్తున చర్చలు అలాగే సాగుతున్నాయి. సగటు జనాలలో ఇంత ఆసక్తి ఉంటే రాజకీయ వర్గాలలో మరింతగా ఉంది.
ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఏపీ ఎన్నికల గురించి ఆరా తీస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో కూటమి ముందుకు వచ్చింది. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కట్టి ఎన్నికల్లో పోరాడుతున్నాయి. దాంతో ఏపీలో ఏమి జరుగుతుంది, కూటమి ప్రభావం ఎంతవరకూ ఉంటుంది అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం గా ఉంది.
మరి తెలంగాణాలో ఎందుకు ఈ రకమైన చర్చ అంటే జనసామాన్యంలో వ్యాపార వర్గాలలోనూ ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతోంది. మరోసారి ఏపీలో జగన్ వస్తే కనుక తెలంగాణాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుంటుందని, కళకళలాడుతుందని అంచనా వేస్తున్నారుట.
అంతే కాదు కూటమి అధికారంలో వస్తే మాత్రం తెలంగాణాలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేల్ అవుతుంది బిజినెస్ కళా విహీనం అవుతుందని కూడా చర్చించుకుంటున్నారుట. అసలు ఎన్నికలు జరుగుతున్న ఏపీలో పొలిటికల్ హీట్ అయితే పెరగలేదు కానీ తెలంగాణాలో మాత్రం ఏపీ ఎన్నికల గురించి ఆలోచిస్తూ వివిధ వర్గాల వారు బీపీని పెంచుకుంటున్నారు.
అంతే కాదు పెద్ద ఎత్తున బెట్టింగులు కూడా వేసుకుంటున్నారుట. ఏపీలో వచ్చేది ఏ పార్టీ ఎవరు సీఎం అవుతారు అన్న దాని మీద పందేల మీద పందేలు కడుతున్నారుట. ప్రత్యేకించి బెట్టింగ్ యాప్స్ లో చూస్తే ఏపీ ఎన్నికల మీదనే పెద్ద ఎత్తున బెట్టింగులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఏపీలో ఎవరు సీఎం అవుతారు అన్నది తెలంగాణాకు ఇపుడు రాజకీయంగా ఆర్ధికంగా సామాజికంగా ముఖ్యంగా మారిపోయింది అని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఒక్కటిగా కలిసి ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ చంద్రబాబు కేసీఆర్ ల మధ్య అంతంత మాత్రంగానే కధ సాగింది. జగన్ కేసీఆర్ మిత్రులు అనుకున్నా కూడా రెండు రాష్ట్రాల మధ్య పెద్దగా ఏమీ సాగింది లేదు.
ఇపుడు చూస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం ఏపీలో టీడీపీ వస్తే చంద్రబాబు సీఎం అవుతారు. ఈ ఇద్దరి మధ్య పార్టీలు వేరు అయినా మంచి అనుబంధం ఉంది. దాంతో అభివృద్ధి సాగుతుందా అన్న చర్చ తెలంగాణాలో ఉంది. జగన్ సీఎం అయితే రేవంత్ రెడ్డి తో ఎడముఖం పెడముఖమే అని అంటున్న వారు ఉన్నారు.
ఇక కాంగ్రెస్ వరకూ చూస్తే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ కి 2029 ఎన్నికలు అన్న లెక్కలు ఉన్నాయని అంటున్నారు. అలాగే కేసీఆర్ విషయానికి వస్తే జగన్ మరోసారి సీఎం అయితే అది ఎంతో కొంత నిబ్బరంగా ఉంటుంది అన్న మాట ఉంది. దాంతోనే తెలంగాణా రాజకీయాలలో కూడా ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలి అన్న దాని మీద చర్చ సాగుతోంది.
ఇక బీజేపీ విషయానికి వస్తే కూటమిలో బీజేపీ ఉంది. తెలంగాణాలో బీజేపీ ఎదగాలని చూస్తోంది. ఏపీలో కూడా బీజేపీ ఎంతో కొంత అధికారంలో షేర్ తీసుకుంటే రానున్న రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో తమ సత్తా చాటుకోవచ్చు అని భావిస్తున్నట్లుగా ఉంది. మొత్తం మీద సగటు ప్రజానీకం నుంచి రాజకీయ నేతల వరకూ రాజకీయ పార్టీల దాకా అందరి దృష్టి ఏపీ ఎన్నికల మీద ఉన్నాయనడంలో సందేహం లేదు.