బిగ్ బ్రేకింగ్... ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ఇదే!
అవును... 17వ లోక్ సభ పదవీకాలం 16 జూన్ 2024తో ముగియనున్న నేపథ్యంలో 18వ లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ను ప్రకటించారు.
By: Tupaki Desk | 16 March 2024 10:59 AM GMTసార్వత్రిక ఎన్నికలు - 2024కు నగారా మోగింది. ఈ రోజు ఢిల్లిలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్ లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధులతో కలిసి లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా... 18వ లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
అవును... 17వ లోక్ సభ పదవీకాలం 16 జూన్ 2024తో ముగియనున్న నేపథ్యంలో 18వ లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ను ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు గానూ 272 సీట్లు సాధించిన పార్టీ లేదా కూటమి.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది! ఈ సందర్భంగా స్పందించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్... 2024 ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ఏడాది అని తెలిపారు. భారత్ లో జరిగే ఎన్నికలకు తమ బృందం పూర్తిగా సిద్ధమైందని అన్నారు.
ఈ క్రమంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్... మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అంటే... గత ఎన్నికల కంటే 32 రోజులు ఆలస్యంగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయన్నమాట. ఈ లెక్కన చూసుకుంటే నేటినుంచి సుమారు రెండు నెలలు 18 రోజులపాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది!
ఇక దేశవ్యాప్తంగా జరగనున్న ఈదఫా ఎన్నికల్లో 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉండగా... వీరికోసం 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఈ ప్రక్రియ కోసం సుమారు 1.5 కోట్ల పోలింగ్ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొననున్నారు. ఈ ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలను, 4 లక్షల వాహనాలను ఉపయోగించనున్నారు. ఇక నేటి నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది.
ఈ సందర్భంగా వెల్లడించిన ఓటర్ల జాబితా ఈ విధంగా ఉంది!:
మొత్తం ఓటర్లు - 96.8 కోట్లు
పురుష ఓటర్లు - 49.7 కోట్లు
మహిళా ఓటర్లు - 47.1 కోట్లు
ట్రాన్స్ జెండర్స్ - 48,000
85 ఏళ్లు పైబడిన ఓటర్లు - 82 లక్షలు
తొలిసారి ఓటు వేయనున్న యువత - 1.85 కోట్లు
20 నుంచి 29 మధ్య వయసున్న ఓటర్లు - 19.74 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్!:
ఎలక్షన్ నోటిఫికేషన్ - మార్చి 18 - 2024
నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ - ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ - మే 13
ఓట్ల లెక్కింపు - జూన్ 4