ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్స్ ఆ రెండు జిల్లాలేనా?
ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ను జూన్ 1 తర్వాత కానీ వెల్లడించకుండా ఈసీ కండిషన్ పెట్టడంతో... పలురకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి
By: Tupaki Desk | 14 May 2024 11:43 AM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ను జూన్ 1 తర్వాత కానీ వెల్లడించకుండా ఈసీ కండిషన్ పెట్టడంతో... పలురకాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి! ఇందులో కొన్ని అధికార వైసీపీకి అనుకూలంగా చెబుతుండగా.. మరికొన్ని మాత్రం కూటమి నేతలకు ఉపశమనం కలిగించేలా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ తెరపైకి వచ్చింది.
అవును... ఏపీలో పోలింగ్ ముగిసింది. ఈ సందర్భంగా సుమారు ఉదయం 7 గంటల నుంచి కొన్ని చోట్ల అర్ధరాత్రి 2 గంటలవరకూ పోలింగ్ జరిగిన తీరు ఆశ్చర్యపరిచిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రధానంగా మహిళా లోకం తో పాటు వృద్ధులు, యువత కూడా అత్యధికంగా పోలింగ్ లో పాల్గొనడం, అర్ధరాత్రైనా ఓటు వేస్తే కాని తిరిగి వెళ్లనంత ఆసక్తిని చూపించడం శుభపరిణామం అని అంటున్నారు.
కొన్ని ప్రాంతాల్లో అయితే పురుషుల కంటే మహిళలు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్న పరిస్థితి! దీంతో... దీనిని పాజిటివ్ ఓటింగ్ గా భావించాలని.. మహిళలకు సీఎం వైఎస్ జగన్ కల్పించిన సాధికారతకు ప్రతి రూపమే పోలింగ్ శాతం పెరిగేందుకు నిదర్శనమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా... ఆమ్మ ఒడి, ఆసరా, ఇళ్ల పట్టాలు, చేయూత లాంటివి మహిళలకే అందించారని గుర్తు చేశారు.
ఈ విధంగా... మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం సీఎం జగన్ కృషిచేశారని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్ జగన్ ను మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు పలు విశ్లేషణలూ తెరపైకి వస్తున్నాయి. క్లాస్ వార్ సౌండ్ కూడా జగన్ కు కలిసొస్తుందని చెబుతున్నారు.
మరోపక్క 2019లో 79.64 శాతం పోలింగ్ నమోదయిందదని.. నాడు అదంతా ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం అని.. ఇప్పుడు కూడా సుమారు 80శాతం పోలింగ్ నమోదయ్యిందని.. ఇది కూడా ప్రభుత్వ వ్యతిరేకతగానే పరిగణలోకి తీసుకోవాలి.. ఫలితంగా ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు తథ్యమని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. ఓటరు ఈ స్థాయిలో పోటెత్తడం ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నం అని విశ్లేషిస్తున్నారు!
ఇలా ఎవరి స్థాయిలో వారు, ఎవరి వెర్షన్ లో వారు తమ తమ విశ్లేషణలు వినిపిస్తున్న పరిస్థితి. అది ఆత్మవంచనా, అసలు సిసలు నమ్మకంతో కూడిన మాటలా అనేది తెలియాలంటే... జూన్ 1న వచ్చే ఎగ్జిట్ పోల్స్ వరకూ అయినా ఆగాలి.. లేదంటే ఏకంగా జూన్ 4న వచ్చే ఫలితాల వరకూ వేచి చూడాలి. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన విశ్లేషణ రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ఇందులో భాగంగా... ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై గెలుపోటములు ఆధారపడి ఉంటాయనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమికి కాస్త అనుకూల పవనాలు వీచాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా విశాఖ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి మంచి స్కోర్ చేస్తుందని చెబుతున్నారు.
ఇదే క్రమంలో... ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ప్రధానంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ దాదాపు వార్ వన్ సైడ్ అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఉందని చెబుతున్నారు. కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఇంతకాలం అక్కడ బలంగా ఉన్న పార్టీలకు, అభ్యర్థులకు సైతం షాక్ లు తప్పకపోవచ్చనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో రెండు నియోజకవర్గ ఓటర్ల నాడి ఇప్పుడు కీ రోల్ పోషించబోతుందని అంటున్నారు.
ఇందులో భాగంగా పైన చెప్పుకున్నట్లు కొన్ని జిల్లాల్లో కూటమి, మరికొన్ని జిల్లాలో వైసీపీ బలంగా పెర్ఫార్మ్ చేశాయని చెబుతున్న నేపథ్యంలో... కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఓటర్ల అభిప్రాయం ఇప్పుడు ఏపీలో అధికారంలోకి ఎవరు వస్తారనే విషయాన్ని డిసైడ్ చేయబోతుందని చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ రెండు జిల్లాలూ ఈసారి గేమ్ ఛెంజర్ లుగా మారబోతున్నాయనే విశ్లేషణ తెరపైకి వచ్చింది.
దీంతో... అమరావతి రాజధాని అంశం కూడా కీలకం కబోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో వచ్చే మెజారిటీ కూడా రాజధాని విషయంలో ఈ రెండు ప్రాంతాల ప్రజానికం అభిప్రాయం తేటతెల్లమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక్కడ అధికార పార్టీకి అద్భుతమైన మద్దతు లభిస్తే మళ్లీ అధికారం కన్ఫాం.. శాసన రాజధానిగా అమరావతి ఫిక్స్ అని అంటున్నారు!
అలా కాకుండా... కూటమికే ఈ రెండు జిల్లాల ప్రజలు జై కొడితే... ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరోసారి ప్రమాణస్వీకారం చేయడంతోపాటు.. అమరావతే రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు! ఏది ఏమైనా... ఈసారి కృష్ణా, గుంటూరు జిల్లాల ఓటర్లు గేమ్ ఛేంజర్ లుగా మారే అవకాశం ఉందనే ఒక విశ్లేషణ తెరపైకి వచ్చింది. మరి ఇది ఏ మేరకు వాస్తవం అవుతుందనేది తెలియాలంటే... జూన్ 4 వరకూ ఆగాల్సిందే!