ఏపీ జనం మూడ్ ఎటు...!?
జనాల మూడ్ ఏమిటో తెలియక రాజకీయ పార్టీలు తల్లకిందులు అవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వైపు జిల్లాలలో సభలతో తిరుగుతూంటే టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు.
By: Tupaki Desk | 6 Jan 2024 4:07 AM GMTఏపీలో ఎన్నికలు చూస్తే దగ్గరలోకి వచ్చేశాయి. గట్టిగా చెప్పాలీ అంటే మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఏపీలో ఎన్నికలను ముందుకు జరపవచ్చు అని ప్రచారం ఉంది. అదే కనుక నిజం అయితే ఇంకా టైం తగ్గిపోతుంది అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో జనాల మూడ్ ఏమిటో తెలియక రాజకీయ పార్టీలు తల్లకిందులు అవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక వైపు జిల్లాలలో సభలతో తిరుగుతూంటే టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు.
కదలిరా అంటూ కొత్త పేరుతో చంద్రబాబు జనవరి నెల మొత్తం మీద అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో భారీ సభలకు శ్రీకారం చుట్టారు. వైసీపీ పాలనను లేకుండా చేయాలని ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన తొలి సభలో బాబు పిలుపు ఇచ్చారు. ఈ సభ నుంచే ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు.
రాష్ట్ర అభివృద్ధి బాధ్యత రాజకీయ పార్టీలదే కాదు ప్రజలది కూడా అని బాబు గట్టిగానే చెప్పుకొచ్చారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం రావాలని తెలుగుదేశంతోనే అది సాధ్యమని ఆయన ఒకటికి పదిసార్లు చెప్పుకొచ్చారు.
మరో వైపు చూస్తే ఏపీ జనం మూడ్ తెలుసుకోవడానికి వారిని టీడీపీ వైపుగా తిప్పడానికే చంద్రబాబు కదలిరా వంటి భారీ కార్యక్రమానికి డిజైన్ చేశారు అని అంటున్నారు. ఈ సభలు పూర్తి అయ్యేనాటికి అంటే జనవరి 29 నాటికి ఏపీ ప్రజల మూడ్ ఏంటో తెలుగుదేశం పార్టీ కనుగొంటుందని అంటున్నారు.
మరో వైపు చూస్తే కదలిరా సభలలో పవన్ కళ్యాణ్ ని కూడా జత చేయాలని చూస్తున్నారు. ఆయన తొలి సభ నుంచే జాయిన్ కావాలి. కానీ ఆయన కనిగిరి సభలో కనిపించలేదు. ముందు ముందు సభలలో కచ్చితంగా పవన్ చంద్రబాబు కలిసే వస్తారని అంటున్నారు. ఆ విధంగా కూటమికి జనాశీర్వాదం తీసుకుంటారు అని అంటున్నారు.
ఇక ఏపీలో చూస్తే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. జనాలు ఏ రాజకీయ పార్టీ పట్ల ఏకపక్షంగా పూర్తి స్థాయిలో మొగ్గు చూపించే పరిస్థితి అయితే ఈసారి ఎన్నికల్లో కనిపించడంలేదు అని అంటున్నారు. దానికి తగిన బలీయమైన కారణాలు కూడా లేవు అని అంటున్నారు.
వెనక్కి వెళ్తే 2014లో చంద్రబాబును నవ్యాంధ్రకు అభ్యుదయ గామిగా చూపించారు సక్సెస్ కొట్టారు. అది జనాల్లో ఉత్తేజంగా పనిచేసి టీడీపీ కూటమి వైపు మొగ్గడానికి కారణం అయింది. 2019లో జగన్ భారీ పాదయాత్రతో ఎన్నికలకు చాలా ముందుగానే జనాలను వైసీపీ వైపుగా తిప్పుకున్నారు. ఇపుడు 2024లో ఎన్నికలు దగ్గరపడుతున్నా అంతలా కదిలించే ఘటనలు అయితే లేవు అని అంటున్నారు.
దాంతో జనాల మూడ్ ఏంటి అన్నది మాత్రం బయటకు తెలియడంలేదు అంటున్నారు. ఈ విధంగా ఉండడం అయితే అధికార పార్టీకే ఎంతో కొంత మేలు చేస్తుంది అని విశ్లేషణలు ఉన్నాయి. అలా కాకుండా జనాల మూడ్ ని చేంజ్ చేసేలా విపక్షం మరింత జోరు చేయాల్సి ఉందని అంటున్నారు.
అందుకే చంద్రబాబు జనవరి నెలను ప్రమాణంగా తీసుకుని కదన రంగంలోకి దూకారు. ఈ నెల చివరి నాటికి జనంలో కచ్చితమైన అభిప్రాయం ఏర్పడకపోయినా విపక్షం కూడగట్టకపోయినా ఈసారి ఎన్నికల ఫలితాలు మాత్రం పూర్తిగా సస్పెన్స్ గానే చివరి వరకూ కొనసాగే చాన్స్ ఉంది. అందుకే సర్వేశ్వరులకు కూడా ఏపీ జనం మూడ్ పట్టుకోవడం వల్ల కావడంలేదు అని అంటున్నారు.