Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ రాజధాని రచ్చ...రంగంలోకి ఆర్బీఐ...!

తాజాగా ఆలిండియా పంచాయతీ పరిషత్ స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ జాస్తి వీరాంజనేయులు రాసిన లేఖకు రిజర్వ్ బ్యాంక్ అధికారులు స్పందిస్తూ ఏపీ రాజధాని ఏదో తెలియడం లేదని చెప్పడం రాజకీయంగా చర్చకు కారణం అవుతోంది.

By:  Tupaki Desk   |   11 April 2024 8:55 AM GMT
ఎన్నికల వేళ రాజధాని రచ్చ...రంగంలోకి ఆర్బీఐ...!
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కాక వేసవి ఎండను మించుతోంది. కాదేదీ వివాదం అన్నట్లుగా ప్రతీ అంశాన్ని తీసుకుని అధికార వైసీపీ విపక్ష టీడీపీ రాజకీయంగా చెడుగుడు ఆడుతున్న నేపధ్యం ఉంది. ఈ నేపధ్యంలో రాజధాని రచ్చ ముందుకు వచ్చింది. నిజానికి ఏపీలో అతి కీలక అంశాల మీద ఎన్నికల ప్రచారం కానీ డిబేట్స్ కానీ ఎక్కడా జరగడంలేదు. వాలంటీర్ వ్యవస్థ మీద సంక్షేమ పధకాల మీద చర్చ అయితే కావాల్సినంత సాగుతోంది.

ఉచిత పధకాల మీదనే అటూ ఇటూ మాట్లాడుతున్నారు. రాజధాని ఇష్యూని ఎందుకో సైడ్ చేశారు. కావాలని అలా జరుగుతోందా అంటే తెలియదు కానీ ఇపుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి వచ్చింది. దాంతో తప్పనిసరిగా రాజధాని విషయంలో ప్రధాన పార్టీలు గొంతు విప్పాల్సి వస్తోంది.

తాజాగా ఆలిండియా పంచాయతీ పరిషత్ స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ జాస్తి వీరాంజనేయులు రాసిన లేఖకు రిజర్వ్ బ్యాంక్ అధికారులు స్పందిస్తూ ఏపీ రాజధాని ఏదో తెలియడం లేదని చెప్పడం రాజకీయంగా చర్చకు కారణం అవుతోంది. ఆర్బీఐ రీజనల్ ఆఫీసులో పెట్టాలని అయిదేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నా ఇప్పటిదాకా అది అమలు కాలేదు. దీని మీదనే జాస్తి వీరాంజనేయులు ఆర్బీఐని వివరణ కోరారు

దానికి ఆర్బీఐ ఇచ్చిన బదులు ఏమిటి అంటే ఏపీ రాజధాని విషయంలో ఉన్న కన్ ఫ్యూజన్ వల్లనే తాము ఎక్కడ ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ పెట్టాలన్నది నిర్ణయించలేదు అని అంటూ చెప్పడం సంచలనం రేపుతోంది. అయితే వీరాంజనేయులు గత ప్రభుత్వం అమరావతిలో ఏకంగా పదకొండు ఎకరాలను ఆర్బీఐ రీజనల్ ఆఫీసు ఏర్పాటు కోసం కేటాయించిందని గుర్తు చేశారు. ఈ నిర్ణయం 2016 డిసెంబర్ 1న తీసుకోవడం జరిగిందని కూడా పేర్కొన్నారు.

విభజన జరిగి పదేళ్ళు పూర్తి అయినా కూడా ఏపీ ప్రభుత్వ అధికారులు నగదు లావాదేవీల కోసం హైదరాబాద్ లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇది అధికారులకు బ్యాంకర్లకు ఎంతో అసౌకర్యంగా ఉంటోందని కూడా ఆయన అనడం విశేషం.

అయితే దీనికి అర్బీఐ జనరల్ మేనేజర్ సుమెద్ జవాదే లేఖ రాస్తూ రాష్ట్ర రాజధాని మార్పు విషయం అన్నది ఏపీలో ఉన్నందున తాము ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ ఏర్పాటు ఎక్కడ అన్నదాని మీద నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. అంతే కాదు రాజధాని మీద తుది నిర్ణయం వచ్చేంతవరకూ కూడా ఆర్బీఐ ఆఫీసు ఏర్పాటు పైనా ఏమీ నిర్ణయించలేమని కూడా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ విశాఖలో రీజనల్ ఆఫీసు ఏర్పాటు కోసం ప్రభుత్వాన్ని స్థలం కోరిందని వార్తలు వచ్చాయి. దాని మీద ప్రభుత్వం కూడా మూడు వేల చదరపు అడుగుల భవనాన్ని ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ కోసం చూడడం జరిగిందని కూడా అంటున్నారు అయిదు వందల మంది ఉద్యోగులకు సరిపడ విశాల భవనాన్ని విశాఖలో ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇపుడు లేటెస్ట్ గా ఆర్బీఐ అధికార్ల వెర్షన్ చూస్తే రాజధాని విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ ఉందని భావిస్తూ వారు వెనక్కి తగ్గారేమో అని అంటున్నారు.