Begin typing your search above and press return to search.

బోర్ కొట్టేస్తోంది బాస్...ఇక ఆపండ్రో !

వాళ్ళు గెలుస్తారు అని కాసేపు, కాదు వీరే గెలుస్తారు అని మరికాసేపు. ఇలా సర్వేలతో పరేషన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 May 2024 2:30 AM GMT
బోర్ కొట్టేస్తోంది బాస్...ఇక ఆపండ్రో !
X

అవును నిజంగా బోర్ కొడుతోంది. ఎంతలా అంటే రాజకీయమే శ్వాసగా పీల్చే వారికి కూడా అని అంటున్నారు. దేని మీద అంటే సర్వేల మీద సర్వేల పేరుతో వచ్చే కుహనా జోస్యాల మీద అని అంటున్నారు. ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఫలితాలకు మాత్రం నికరంగా 23 రోజుల అతి పెద్ద గడువు మిగిలిపోయింది. సరే అనుకుని భారంగా దాన్ని మోస్తున్న రాజకీయ పిపాసకులకు అభిమానులకు ఘడియకో జోస్యం గంటలో సర్వే మెదడుని తినేస్తున్నాయి.

వాళ్ళు గెలుస్తారు అని కాసేపు, కాదు వీరే గెలుస్తారు అని మరికాసేపు. ఇలా సర్వేలతో పరేషన్ చేస్తున్నారు. అది ఎంతలా అంటే ఇష్టంగా రాజకీయ వార్తలు చదివే వారికీ పొలిటికల్ న్యూస్ నిండా నింపే యూ ట్యూబ్ చానళ్ళను చూసే ఫ్యాన్స్ కి భరించరాని అంతగా అని అంటున్నారు.

ఆఖరుకు కౌంటింగ్ కి గడువు దగ్గర పడుతున్న వేళ మెదడు చేదెక్కిపోయి గుండె బరువెక్కిపోయి జీవచ్ఛవాలుగా మారిపోయిన సీన్ అయితే అందరినీ చూస్తే కనిపిస్తోంది. జోస్యాలు నమ్ముదామా అంటే అందులోనూ ఎన్నో రాజకీయ రంగులు ఉన్నాయి.

సర్వేలలో శాస్త్రీయత ఉందా అంటే దానికీ లెక్కా లేదూ కిక్కూ రాదు అని అంటున్నారు. ఈ పరిణామాలతో బేజారెత్తిన ఆయా పార్టీల అభిమానులు సైతం దేవుడా ఎన్నికలు పెట్టావు సరే కానీ కౌంటింగ్ కి ఎందుకు ఇంత సుదీర్ఘమైన గడువు పెట్టి మమ్మల్ని చంపావ్ అని నువ్వు నాకు నచ్చావ్ లో ప్రకాష్ రాజ్ డైలాగ్ ని వల్లె వేస్తున్నారుట.

కాదేదీ సర్వేకు అనర్హం అన్నట్లుగా ఎవరికి తోచినది వండి వార్చితే చిట్టి మెదడు తట్టుకోవద్దూ అని కూడా వారు అంటున్నారు. నిజమే తమ పార్టీ అధికారంలోకి రావాలని ఉంటుంది. కానీ ఇపుడు సాగుతున్న ఈ రొచ్చు రాజకీయం పుచ్చు సర్వేలను చూసిన మీదట ఎవరో ఒకరు కానీయ్ ముందు మాత్రం రిజల్ట్ చెప్పేయ్ అనేయాలనిపిస్తోందిట.

దేనికైనా టైం ఉంటుంది. మరీ ఇంత సుదీర్ఘమా స్వామీ అంటూ గుళ్ళూ గోపురాలు తిరిగే జనాలు కూడా ఉన్నారు. అయినా టెన్షన్ కి తట్టుకోవడానికి ఎవరికైనా పిడికెడు గుండె మాత్రమే కదా ఆ గాడ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. అన్నీ తెలిసి ఇంతలా టెన్షన్ పెడితే కౌంటింగ్ వేళకు తీరా ఆ గుప్పెడు గుండె చప్పున ఆగితే దిక్కెవరు అంటున్నారు. అయినా సర్వేలు అన్నది ఎవరు కనిపెట్టారురా బాబోయ్ అని కూడా గుండెలు బాదుకుంటున్న బాపతూ ఉంది. ఏ సర్వేలూ లేని రోజులూ ఏ హడావుడీ కానరాని రోజులే బాగున్నాయని నిట్టూరుస్తున్నారుట.

ఒకనాడు అంటే 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి పోటీ చేస్తే బ్యాలెట్ పేపర్ల మీద కౌంటింగ్ జరిగింది. జనవరి 5న పోలింగ్ ఆ తరువాత వెంటనే కౌంటింగ్, 9వ తేదీ కల్లా నందమూరి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేశారు.

ఏ సర్వేల ఘోషా ఏ జోస్యం గోసా లేని బంగారు రోజులు అవి. మళ్ళీ అలాంటి రోజులను ప్రసాదించు స్వామీ అని వేడుకుంటున్నారుట. మొత్తం మీద చూస్తే ఏపీలో ఇంతలా భీకరమైన పోరు సాగడం ఇదే ఫస్ట్ టైం. అయితే దానిని మించిన తీరులో సోషల్ మీడియాలో న్యూస్ ఉంటోంది. అసలు ఫలితం కంటే ఈ భ్రమలలో పెట్టే సర్వేలతో బతుకు బస్టాండు అవుతోంది అంటున్నారు.

జమిలి ఎన్నికలు అంటూ వస్తే దేశంలో ప్రతీ రాష్ట్రంలో ఏపీ లాంటి స్థితి వస్తుంది సుమా అని అంటున్నారు. లోక్ సభకు రెండు నెలల సుదీర్ఘమైన షెడ్యూల్ ఉంటుంది. దాంతో అసెంబ్లీలు కలిస్తే చితక్కొట్టుడే అని చెప్పడానికి ఏపీ ఒక నిలువెత్తు ఉదాహరణ అని అంటున్నారు.