Begin typing your search above and press return to search.

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. కీలక నిర్ణయం!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 May 2024 12:36 PM GMT
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. కీలక నిర్ణయం!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ ఉన్న డీజీపీ వల్ల కాదని.. ఆయనను కూటమి నేతల ఫిర్యాదు మేరకు మార్చినా కూడా ఎందుకు ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగాయంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ విషయంపై ఈసీ సీరియస్ అయ్యింది.

అవును... ఏపీలో పోలింగ్ రోజు పలు హింసాత్మక ఘటనలు జరగడం.. అది జరిగి మూడు రోజులు పూర్తవుతున్న ఆ రచ్చ సద్దుమణిగినట్లు కనిపించకపోవడంపై ఈసీ సీరియస్ అయ్యింది! పోలింగ్ సమయంలోనూ.. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాలను ఆదేశించింది. ఈ ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు పంపింది.

దీంతో... ఈ ఇద్దరు అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లి, కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై, ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఎన్నికలతో పాటు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల పట్ల స్థానిక అధికారులు నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వదిలేసినట్టు ఈసీ గుర్తించిందని తెలుస్తుంది. పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రాం మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సీఈసీకి నివేదించినట్టు తెలుస్తోంది.

దీపక్ మిశ్రాపై వైసీపీ ఫిర్యాదు!:

మరోపక్క టీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపారంటూ ఏపీ పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైసీపీ ఫిర్యాదు చేసింది! పోలింగ్‌ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని ఆయన పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చారని.. పోలింగ్‌ కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్‌ ఇచ్చిన పార్టీకి ఆయన హాజరైనట్లు గుర్తించబడ్డారని ఆ ఫిర్యాదులో పెర్కొన్నట్లు తెలుస్తుంది.

చంద్రగిరిలో రచ్చ రచ్చ!:

పోలింగ్‌ అనంతరం మంగళవారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌ లను పరిశీలించేందుకు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వచ్చిన సమయంలో... తీవ్ర రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ - టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.

పల్నాడు జిల్లాలో విధ్వంసం!:

చంద్రగిరి రచ్చ ఒకెత్తు అయితే పల్నాడు జిల్లాలో జరిగిన దారుణాలు మరొకెత్తు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో... గురజాల నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యకర్తలు వైసీపీకి ఓటు వేశారనే కారణంతో ఇళ్లపై దాడులు చేయడంతో భయబ్రాంతులకు గురైన మహిళకు గుడిలో దాక్కున్న పరిస్థితి!

తాడిపత్రిలో విధ్వంస కాండ!:

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ పార్టీల అనుచరులు విధ్వంసకాండను సృష్టించారు. తాడిపత్రిలోని చింతలరాయుని పాలెంలో టీడీపీ - వైసీపీ పోలింగ్ ఏజెంట్ల మధ్య తీవ్ర రచ్చ జరిగింది. అనంతరం జరిగిన ఘటనలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం.. జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురవ్వడం తెలిసిందే!