ఈసీ సీరియస్...వేటు పడిపోయింది !
ఈ నేపధ్యంలో పోలింగ్ అనంతరం అల్లర్లు గొడవల మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
By: Tupaki Desk | 16 May 2024 6:29 PM GMTఏపీలో జరిగిన ఎన్నికలు ఈసారి ఎన్నడూ లేని విధంగా హింసను ప్రజ్వరిల్లచేశాయి. దీంతో అమాయకుల తలకాయలు కొబ్బరికాయల మాదిరిగా పగిలిపోయాయి. ఊళ్ళకు ఊళ్ళూ ఖాళీ చేసి జనాలు పొలాల్లో ఇతర ప్రాంతాలలో తలదాచుకున్నారు. ఈ నేపధ్యంలో పోలింగ్ అనంతరం అల్లర్లు గొడవల మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
ఎన్నడూ లేని విధంగా అసాధారణ రీతిలో సీఎస్, జవహర్ రెడ్డి డీజీపీని హుటాహుటీన ఢిల్లీ పిలిపించుకుంది. వారిద్దరి నుంచి మౌఖికంగా నివేదికలు తీసుకుంది అని సమాచారం. ఆ వెంటనే ఈసీ యాక్షన్ లోకి దిగిపోయింది.
మండుతున్న ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారుల మీద వేటు పడిపోయింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని నిర్ధారించింది. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్టు నివేదిక అందిందని ఈసీ వెల్లడించింది. స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించినట్టు సీఎస్, డీజీపీ తెలిపారని స్పష్టం చేసింది.
ఈ మేరకు రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక ఘటనలపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. అదే సమయంలో, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. అదే విధంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
హింసాత్మక ఘటనలపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి కేసుపై సిట్ వేసి రెండ్రోజుల్లో నివేదిక అందించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. వీటిని బట్టి చూస్తూంటే ఈసీ చాలా సీరియస్ గా ఉందని అర్ధం అయింది. అంతే కాదు మరో పదిహేను రోజుల పాటు ఏపీలో కేంద్ర బలగాలను ఉంచాలని కేంద్ర హోం శాఖను కూడా ఈసీ ఆదేశించింది.
ఈసీ సీరియస్ గా రంగంలోకి దిగడంతో ఏపీలో రాజకీయ పరిణామాల పట్ల ఎంతటి నిశిత పరిశీలన ఉందో అర్ధం అవుతోంది అని అంటున్నారు. అదే విధంగా ఈ నేపధ్యంలో చాలా మంది అధికారుల మీద రానున్న రోజులలో వేటు పడబోతోంది అని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలో హింసను ఉక్కు పాదంతో అణచివేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా గమనార్హం.