Begin typing your search above and press return to search.

దరిద్రపుగొట్టు ట్రెండ్: ఛీ.. ఛీ.. ఎగ్జిట్ పోల్స్ ను మార్చేయటమా?

ఇప్పుడు పాతిక నుంచి నలభై వరకు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   2 Jun 2024 4:29 AM GMT
దరిద్రపుగొట్టు ట్రెండ్: ఛీ.. ఛీ.. ఎగ్జిట్ పోల్స్ ను మార్చేయటమా?
X

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా.. తాము నమ్మిన దాన్ని తాము అనుకున్న రీతిలో జనాలకు చెప్పే తీరు కొందరిలో ఉంటుంది. సోషల్ మీడియా కాలంలో అది మరింత పెరిగింది. ఏపీలోని ప్రత్యేక రాజకీయ వాతావరణం నేపథ్యంలో ఈ దరిద్రం పీక్స్ కు చేరింది. అదెంత? అంటే.. నోరెళ్లబెట్టేసే స్థాయికి వెళ్లిపోయింది. గతంలో ఎగ్జిట్ పోల్స్ అంటే మహా అయితే ఐదారు సంస్థలు మాత్రమే వెల్లడించేవి. ఇప్పుడు పాతిక నుంచి నలభై వరకు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడిస్తున్నాయి.

వీటిల్లో గడిచిన పదేళ్లలో కొంత పేరు తెచ్చుకున్న ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. ఒకప్పుడు ఎగ్జిట్ పోల్స్ ను జాతీయ మీడియా సంస్థలు తప్పనిసరిగా వెల్లడించేవి. జాతీయ మీడియా సంస్థలతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించకుండా ఉండటంచూస్తున్నదే. ఇందుకు మినహాయింపుగా కొన్ని సంస్థలు ఉన్నప్పటికీ.. వాటి సంఖ్య చాలా తక్కువ.

తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలతో పాటు.. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ను చూసినప్పుడు దరిద్రపుగొట్టు ట్రెండ్ ఒకటి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఈ కొత్త దరిద్రం పుణ్యమా అని మన కళ్ల ముందు కనిపించే ఏ సమాచారం నిజం కాదన్నట్లుగా మారింది. మరి.. ముఖ్యంగా ఈ దరిద్రానికి అసలుసిసలు క్రియేటర్లు తెలుగు వారిగా చెప్పాలి.

ఏపీలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెలువడనున్నాయి. దీనికి మూడు రోజుల ముందుగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సారాంశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకుంటే.. ఈసారి మొదలైన చెత్త ట్రెండ్ ఏమంటే.. కొన్ని పేరున్న ప్రైవేటు సంస్థలు.. మీడియా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ను తాము మద్దతు ఇచ్చే పార్టీకి అనుకూలంగా మార్చుకొని.. వాటిని పోస్టులుగా మార్చేసి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పోస్టు చేస్తున్నారు. దీంతో.. తాము మద్దతు ఇచ్చే పార్టీకి అనుకూలంగా ఉండే పోస్టుల్ని ఆయా మద్దతుదారులు షేర్ చేయటం కనిపించింది.

పరిమిత సంఖ్యలో ఎగ్జిట్ పోల్స్ వెలువడితే.. అంకెల్లో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఫేక్ పోస్టుల సంగతి ఇట్టే అర్థమయ్యేది. తాజా ఎగ్జిట్ పోల్స్ లో పెద్ద ఎత్తున విడుదల కావటంతో ఫేక్ గాళ్ల ఫేక్ న్యూస్ ను క్రియేట్ చేస్తూ.. వైరల్ చేస్తున్నాయి. ప్రముఖ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ ను తమకు అనుకూలంగా మార్చేసి.. తాము మద్దతు పలికే పార్టీలకు అనుకూలంగా అంకెల్ని వేసేయటం చూస్తే.. సరికొత్త దరిద్రపుగొట్టు ట్రెండ్ కు తెర తీశారని చెప్పాలి. దీంతో.. కళ్ల ముందు కనిపించే ఏ పోస్టులోని అంకెలు నిజమైనవో.. ఏ అంకెలు ఫేక్ అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిన దుస్థితి.