Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్... క్రెడిబిలిటీ కథాకమీషులివే!

దీంతో శనివారం సాయంత్రం 6:30 నిమిషాల నుంచి దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సందడి చేశాయి

By:  Tupaki Desk   |   2 Jun 2024 6:36 AM GMT
ఎగ్జిట్ పోల్స్... క్రెడిబిలిటీ కథాకమీషులివే!
X

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందడి శనివారంతో ముగిసింది. దీంతో శనివారం సాయంత్రం 6:30 నిమిషాల నుంచి దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు సందడి చేశాయి. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో మెజారిటీ సర్వే సంస్థలు ఏకాభిప్రాయంగా అన్నట్లు కేంద్రంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి రాబోతుందని అంచనా వేశాయి.

ఐదు పది నెంబర్లు అటు ఇటైనా దాదాపుగా అన్ని సంస్థలూ ఇదే విషయాన్ని వెల్లడించడంతో.. ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై కాస్త నమ్మకంగా మాట్లాడుతున్నారు పరిశీలకులు. ఆ సంగతి అలా ఉంటే... జాతీయ స్థాయిలో ఒక్కమాట మీద ఉన్నట్లుగా, ఎగ్జాట్ గానే ఎగ్జిట్ పోల్ ఫలితాలను అంచనా వేసినట్లుగానే తెలిపిన సంస్థలు ఏపీ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వెల్లడించాయని అంటున్నారు.

అవును... ఏపీలో మెజారిటీ సర్వే సంస్థలు పార్టీల వారీగా విడిపోయాయా అనే చర్చ ఎగ్జిట్ పోల్ ఫలితాల విడుదల అనంతరం తెరపైకి రావడం గమనార్హం. ఓటరు ఒకసారి తన ఓటు హక్కు వినియోగించేసుకున్న తర్వాత చెప్పిన అభిప్రాయానికి అనుగుణంగా అంచనా వేసి వెల్లడించే ఈ ఫలితాల్లో ఇలా పూర్తిస్థాయి విరుద్దంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎందుకు వెలువడ్డాయనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ప్రధానంగా క్రెడిబిలిటీ అనేది ఇక్కడ కీ రోల్ పోషిస్తుందని అంటున్నారు. ఉదాహరణకు ఏపీలో ఒక సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ / సర్వే ఫలితాలు ఇప్పటివరకూ తప్పలేదని అంటారు. దీనికి తాజా ఉదాహరణగా 2019లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూపిస్తున్నారు. దీంతో... ఈ సంస్థ ఇచ్చే ఫలితాలపైనే ఎక్కువమంది ఆరా తీస్తుంటారు!

ఇదే సమయంలో జాతీయ స్థాయిలో యాక్సిస్ మై ఇండియా సంస్థ గతంలో వెల్లడించిన అంచనాలు.. అనంతరం వచ్చిన అసలు ఫలితాలు ఏమాత్రం పొంతనలేకుండా ఉండటాన్ని కూడా పరిశీలకులు ప్రస్థావిస్తున్నారు. ఇందుకు ఉదాహరణలుగా 2021 వెస్ట్ బెంగాల్... 2023 లో ఛత్తీస్ ఘర్, రాజస్థాన్ లలో వెల్లడించిన ఫలితాలను గుర్తుచేస్తున్నారు.

ఇందులో భాగంగా... 2021లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఈ సంస్థ తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... బీజేపీ 134 - 160 స్థానాల్లో విజయం కన్ ఫాం అని తెలిపింది. తీరా అసలు ఫలితాలు వచ్చే సరికి బీజేపీ 77 స్థానాలకు పరిమితమవ్వగా... మమతా బెనర్జీ నేతృత్వంలోని ఏఐటీసీ 215 స్థానాలతో క్లీన్ మెజారిటీ సాధించింది.

2023లో ఛత్తీస్ ఘర్ లో జరిగిన ఎన్నికలపైనా ఈ సంస్థ తమ అంచనాలను వెల్లడించింది. ఇందులో భాగంగా... అక్కడ కాంగ్రెస్ కు 42% ఓట్ షేర్ ఉంటే, బీజేపీకి 41% ఓట్ షేర్ ఉందని అంచనా వేసింది! అంటే... కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ అని తెలిపిందన్నమాట. అయితే... అసలు ఫలితాల్లో మాత్రం బీజేపీ 54 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ 35 స్థానాలను దక్కించుకుంది.

ఇదే క్రమంలో... అదే ఏడాది రాజస్థాన్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఈ సంస్థ ప్రిడిక్షన్... కాంగ్రెస్ కు 106 సీట్లు, బీజేపీకి 80 నుంచి 100 స్థానాలు అని చేసింది. అయితే అనూహ్యంగా ఇక్కడ బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ 69 స్థానాల్లో మాత్రమే గెలిచింది. దీంతో ఈ సంస్థ అంచనాలపై నెట్టింట సెటైర్లు పేలాయి.

ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలపైనా తమ అంచనాలను వెల్లడించింది ఈ సంస్థ. ఇందులో భాగంగా... ఏపీలో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమికి 21 - 23 స్థానాల్లో వీజయం దక్కే అవకాశం ఉండగా... వైసీపీకి 2 - 4 స్థానాలు మాత్రమే దక్కుతాయని అంచనా వేస్తూ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. దీంతో ఈ సంస్థ ఫలితాలను చూసిన వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుండగా.. పలువురు నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో సెటైర్లు పేర్లుస్తున్నారని అంటున్నారు!