జీవోలను అప్ లోడ్ చేయట్లేదన్న ఏపీ హైకోర్టుకు ప్రభుత్వ ఆన్సర్ ఇదా?
ఈ అంశంపై ఇప్పటికే పలువురు ప్రజాహిత వ్యాజ్యాల్ని ఫైల్ చేశారు. వీటికి సంబంధించిన విచారణ తాజాగా ఏపీ హైకోర్టులో జరిగింది.
By: Tupaki Desk | 16 Nov 2023 4:14 AM GMTప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో ప్రజలకు తెలీకుండా దాచి పెట్టాల్సిన అంశాలు పెద్దగా ఉండకూడదు కదా? కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం విడుదల చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ జరగకపోవటం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసే జీవోలను అప్లోడ్ చేయకుండా ఉంటున్న ప్రభుత్వం తీరును తప్పు పడుతూ ఇప్పటికే ఏపీ హైకోర్టును పలువురు ఆశ్రయించారు.
ఈ అంశంపై ఇప్పటికే పలువురు ప్రజాహిత వ్యాజ్యాల్ని ఫైల్ చేశారు. వీటికి సంబంధించిన విచారణ తాజాగా ఏపీ హైకోర్టులో జరిగింది. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్.. జస్టిస్ ఆర్. రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టారు. నిజానికి పిటిషన్ దారులు కొంతకాలంగా ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తున్నారు. తమ వ్యాజ్యాలను త్వరగా పరిష్కరించాలని వారు కోరారు. ఈ నేపథ్యంలో కేసును విచారిస్తున్న ధర్మాసనం జీవోలను వెబ్ సైట్ లో అందుబాటులోకి ఉంచకపోవటాన్ని ప్రశ్నించారు.
జీవోలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయటానికి వచ్చే ఇబ్బందేమిటి? అంటూ సూటిగా ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రాధాన్యం లేని జీవోలను మాత్రమే అప్ లోడ్ చేయటం లేదని పేర్కొనటం గమనార్హం. అయినా.. జీవోలు ఏమైనా కానీ.. సమాచారం కోసమైనా అప్ లోడ్ చేస్తే జరిగే నష్టం ఏమీ లేదు. ప్రాధాన్యత లేదని అప్ లోడ్ చేయకుండా ఉండటం తప్పుడు సంకేతాల్ని ఇస్తుంది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు.
పిటిషన్ తరఫున వాదించే న్యాయవాదులు.. ప్రభుత్వం విడుదల చేసే జీవోల్లో 90 శాతం అప్ లోడ్ చేయట్లదేని ఆరోపించగా.. అత్యవసరమైన జీవోలను జారీ చేసిన తర్వాతి రోజున అప్ లోడ్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికతను పరిగణలోకి తీసుకున్నా.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తాముజారీ చేసే జీవోల్ని తక్షణమే అప్ లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ఒక రోజు కూడా టైం ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న