Begin typing your search above and press return to search.

ఏపీ టాలెంట్ ని వెలికి తీయనున్న చంద్రబాబు !

దేశంలో ఎవరూ ఎక్కడా చేయని ఒక వినూత్య ప్రయోగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు.

By:  Tupaki Desk   |   5 Aug 2024 3:49 AM GMT
ఏపీ టాలెంట్ ని వెలికి తీయనున్న చంద్రబాబు !
X

దేశంలో ఎవరూ ఎక్కడా చేయని ఒక వినూత్య ప్రయోగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. దానికి ఇంగ్లీష్ లో స్కిల్ సెన్సస్ గా పేరు పెట్టారు. తెలుగులో అయితే నైపుణ్య గణన అని అర్ధం. ఈ విధంగా నైపుణ్య గణన కేవలం నిరుద్యోగులకు మాత్రమే చేస్తారు అని అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారి నుంచి పూర్తి వివరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఏపీలో ఈ ఏజ్ గ్రూప్ అంటే దాదాపుగా తొంబై శాతం జనాభా వచ్చేస్తారు. వీరంతా వర్క్ ఫోర్స్ గా ఉంటున్నారు. వీరు ప్రైవేటు రంగంలో అసంఘటిత రంగంలో పనిచేస్తూ జీవితాలను గడుపుతున్నారు. ఇక చదువుకున్న వారు అయితే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.

వీరందరి వివరాలు ప్రభుత్వం సేకరించడం వెనక అనేక ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఏపీలో ఎన్ని వృత్తులు ఉన్నాయి. వాటి మీద ఎంత శాతం ఆధారపడుతున్నారు అన్న లెక్క తేలుతుంది. అంతే కాదు ఏపీలో ఉపాధిని ఇచ్చే వృత్తులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటే వాటిని మరింతగా అభివృద్ధి చేయడం ఆయా వృత్తులను ఆశ్రయించిన వారికి అన్ని విధాలుగా అండగా ఉండి ప్రోత్సహించడం చేయవచ్చు.

అంతే కాదు ఏపీలో ఇంత టాలెంట్ ఉందని ప్రపంచానికి కూడా తెలుస్తుంది. దేశంలో అయితే ఎవరూ ఈ తరహా అధ్యయనాలు చేయలేదు. దాంతో ఏపీలో ఈ సెన్సస్ దాని వివరాలు బయటకు వస్తే దేశమంతా ఏపీ వైపు చూడాల్సి ఉంటుంది. ఇక కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెత ఉంది. ఏపీ లో ఎన్ని విద్యలు ఉన్నాయన్నది ఒక పరిశోధంగానూ ఆసక్తిగా ఉంటుంది.

అలాగే సనాతన కాలం నుంచి ఉన్న కుల వృత్తులు ఇంకా ఉన్నాయా లేక అదృశ్యం అయ్యాయా అన్నది కూడా తెలుస్తుంది. ఏపీలో అయిదు కోట్లకు పైగా జనాభా ఉంటే అందులో డెబ్భై శాతం పైగా ప్రజలు వ్యవసాయం మీద దాని అనుబంధ వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు అన్నది ఉజ్జాయింపుగా అంతా అనుకునే విషయం. కానీ నిజానికి ఎంత మంది ఈ వృత్తుల మీద ఉన్నారు అన్నది పక్కాగా ఈ సెన్సస్ ద్వారా తేలనుంది.

ఏపీని పారిశ్రామికంగానూ సేవారంగంలోనూ ఇతర రంగాలలోనూ అభివృద్ధి చేయడానికి ఈ నైపుణ్య గణన తప్పకుండా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇక వ్యవసాయ వృత్తులలో ఉన్న వారికి మంచి పరికరాలు అందుబాటులో ఉన్న సాంకేతికత వంటివి అందించి మరింతగా వారు రాణించేలా ప్రోత్సహించవచ్చు అని అంటున్నారు.

అలాగే గృహిణులు చదువుకుని చిన్న పనులు చేసుకునే మహిళల టాలెంట్ బయటపడితే వారికి ఆర్ధికంగానూ ఇతరత్రా ఆసరాగా ప్రభుత్వం ఉండి వారిని ముందుకు నడిపించే అవకాశం ఉంది. అలాగే వారికి అభిరుచి ఉన్న రంగాలలో తర్ఫీదు ఇచ్చి వారిని స్వయం సమృద్ధి కలిగిన వారుగా నిలబెట్టవచ్చు అని కూడా అంటున్నారు.

ఈ సెన్సస్ ని రెండు నెలల పాటు ఏపీ అంతటా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నైపుణ్య గణన కోసం సచివాలయ ఉద్యోగులను వాడుకుంటారు. ప్రతీ ఉద్యోగికి వారి పరిధిలో ఇరవై మంది వివరాలు సేకరించే పనిని అప్పచెబుతున్నారు. కేవలం ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న వారు అలాగే విదేశాలలో ఉన్న వారికి కూడా నైపుణ్య గణన యాప్ ని అందించి వివరాలు వారి నుంచి స్వయంగా తెలుసుకుంటారు అని అంటున్నారు.

ఏది ఏమైనా చంద్రబాబు మంచి ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమం సక్సెస్ అయితే ఏపీలో ని మొత్తం కోట్ల మంది టాలెంట్ ఏంటి అన్నది బయటకు వస్తుంది. దానికి తగినట్లుగా ప్రభుత్వం ఏమి చేయాలో కూడా యాక్షన్ ప్లాన్ ని రూపొందించేందుకు అవకాశం ఉంటుంది. ఏపీలో ఇది సక్సెస్ అయితే దేశమంతా దీనిని అనుసరించే అవకాశం కూడా ఉంది.