Begin typing your search above and press return to search.

జూలై 1న రూ.4000 + రూ.3000... ఏపీ బడ్జెట్ ఏమి చెబుతుంది?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   10 Jun 2024 7:19 AM GMT
జూలై 1న రూ.4000 + రూ.3000... ఏపీ బడ్జెట్  ఏమి చెబుతుంది?
X

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 175 అసెంబ్లీ స్థానాల్లో 164 స్థానాలు కూటమి గెలుచుకుంది. దీనికి బలమైన కారణాల్లో ఒకటి... చంద్రబాబు ఇచ్చిన హామీలు అని అంటున్నారు పరిశీలకులు. ఇందులో ప్రధానంగా... సామాజిక పెన్షన్లు అని నొక్కి చెబుతున్నారు. దీంతో... జూలై 1వ తేదీన ఈ హామీని చంద్రబాబు ఎలా నెరవేరుస్తారనేది ఆసక్తిగా మారింది.

అవును... ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి గల బలమైన కారణాల్లో పెన్షన్ పెంపుకూడా ఒకటనే అంటున్నారు. పైగా జగన్ 250 రూపాయల చొప్పున పెంచుతానని హామీ ఇవ్వగా... చంద్రబాబు మాత్రం తాను అధికారంలోకి రాగానే 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని.. అది కూడా ఏప్రిల్ నుంచే అమలుచేస్తామని తెలిపారు.

దీంతో జూలై నుంచి వృద్ధులు, ఓంటరి మహిళలకు పెరిగిన వెయ్యి తో కలిపి 4000 + ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వెయ్యి వెయ్యి వెయ్యి కలిపి మొత్తం 7000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అంటే.. జూలై 1న అందే పెన్షన్ ఒక్కొక్కరికీ రూ.7000. ఆగస్టు నుంచి రెగ్యులర్ గా 4000 అందనుంది.

అయితే... ప్రస్తుతానికి ఏపీ బడ్జెట్ ను పరిశీలిస్తే... రూ.7000 రూపాయలు సుమారు 60లక్షల మందికి ఇచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. పైగా సెప్టెంబర్ వరకూ ఉన్న అప్పుల లిమిట్ ను జగన్ సర్కార్ ముందుగానే వాడేసిందనే విషయాన్ని తెరపైకి తెస్తున్నారు.

ఇంత క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు ఇచ్చిన కీలక హామీ.. కూటమి గెలుపులో కీలక భూమిక పోషించిన హామీ అయిన ఈ రూ.4000 + రూ.3000 పెన్షన్ హామీని చంద్రబాబు ఎలా నెరవేరుస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే... ప్రస్తుతానికి ప్రభుత్వం కాస్త కుదురుకునేవారకూ పెంచిన వెయ్యితో కలిపి రూ.4000 జూలై 1 ఇచ్చేసి, తర్వాత మిగిలిన రూ.3000 వేలను విడతల వారీగా ఇస్తారా అనేదీ చూడాలి!