ఉద్యోగులు జై కొట్టింది ఆ పార్టీకేనా ?
ఇదిలా ఉంటే ఏపీలో విభజన తరువాత వరసగా రెండు ప్రభుత్వాలను ప్రభుత్వ ఉద్యోగులు చూశారు.2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వం
By: Tupaki Desk | 5 May 2024 3:03 PM GMTఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. భారీ సంఖ్యలో ఉన్న ఉద్యోగులు ఏపీ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన భూమిక పోషిస్తారు. వారు ప్రభుత్వాలను మార్చే శక్తి సామర్ధ్యాలు ఉన్నవారు. అదే టైం లో తమకు నచ్చిన ప్రభుత్వాన్ని నెత్తికెత్తుకునే నైజం వారికే ఉంది.
ఇదిలా ఉంటే ఏపీలో విభజన తరువాత వరసగా రెండు ప్రభుత్వాలను ప్రభుత్వ ఉద్యోగులు చూశారు.2014 నుంచి 2019 దాకా టీడీపీ ప్రభుత్వం. అలాగే 2019 నుంచి 2024 దాకా వైసీపీ ప్రభుత్వం వారు చూశారు. 2024 ఎన్నికల్లో అధికారం కోసం టీడీపీ వర్సెస్ వైసీపీగా సాగుతున్న పోరులో ఉద్యోగులు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంది.
మరి వారు ఏ వైపు మొగ్గారు అన్నది చూస్తే కనుక ఉద్యోగులు వైసీపీ వైపే మొగ్గారు అని అంటున్నారు. ఈ మేరకు వస్తున్న అంచనాలు చూసిన వారు వైసీపీ వైపే వారు ఉన్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా అధిక శాతం ఓట్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ వైపు పొలవుతున్నట్లు తెలుస్తోంది
వాస్తవానికి గతంలో చంద్రబాబు ఉద్యోగులను చిన్నచూపు చూడటంతో పాటు ఉద్యోగులకు భారీ జీతాలు ఎందుకు అని అవహేళన చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. కాలం మారినా ఇవన్నీ ఉద్యోగులకు గుర్తున్నాయని అంటున్నారు. అంతే కాదు దీంతోపాటు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్( జీపీఎస్) తమకు లాభసాటి అని ఉద్యోగులు భావిస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగులకు వ్యతిరేకమే అన్నది అందరికీ తెలిసిందే అని కూడా అంటున్నారు.
ఇక ఏపీలో టీడీపీ కానీ చంద్రబాబు కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే తమకు మరింత నష్టం అని ఉద్యోగులు భయపడుతున్నారన్న మాట కూడా ఉంది. అది ఎలా అంటే ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ ఆదివారాలు సెలవు దినాలు అన్నది కూడా లేకుండా సమావేశాలు పెట్టడం ఎనిమిది గంటల పని వ్యవధి ఉన్నా వాటికి మించే ఏవో మీటింగులు అంటూ పని భారం పెంచుతారు అన్న విమర్శలూ ఉన్నాయి.
ఇక వీటితో పాటుగా చూస్తే ఉద్యోగులకు జీతాలు అతి ముఖ్యం. వారికి నెలకు కచ్చితంగా అవి అందాలి. లేక పోతే సగటు ఉద్యోగి మనుగడ సాగించలేడు. అదే విధంగా రాష్ట్ర ఖజానా పరిస్థితి, రాష్ట్ర ఆదాయం గురించి ఉద్యోగుల కంటే ఎవరికీ తెలియదు.
దాంతో వారు అప్పుల కుప్పగా ఏపీ అయితే తమకు జీతాలు కూడా రాని దుర్భర పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. టీడీపీ కూటమి ప్రకటించిన తాజా మ్యానిఫేస్టోతో పాటు చంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలంటే ఎక్కడలేని డబ్బు సరిపోదు అన్నది చెప్పడానికి ఆర్థిక వేత్తలు అక్కరలేదు. ఉద్యోగులతో పాటు సగటు జనాలకు కూడా తెలుసు అంటున్నారు.
ఇక ఏపీ రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఇచ్చినా ఒక మూలకు రాదు అన్నది తెలిసిన ప్రభుత్వ ఉద్యోగులే ఇపుడు ఆలోచనలో పడ్డారు అన్న ప్రచారమూ ఉంది. అందువల్ల చంద్రబాబు గెలిస్తే నిధులన్నీ ఆయా సంక్షేమ పథకాలకు మళ్లించి తమకు అసలు జీతాలు కూడా రావని భయపడిన ఉద్యోగులు జగన్ మోహన్ రెడ్డికి ఓటేయడానికి సిద్ధమయ్యారన్నది ఒక కచ్చితమైన అంచనాగా ఉంది.
దాంతోనే ఏపీలో విభజన తరువాత ముచ్చటగా మూడవసారి ఏర్పడబోయే ప్రభుత్వం వైసీపీదే అవుతుందని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే భారీగా తమ ఓట్లను వైసీపీకి అనుకూలంగా వేశారు అన్నది ఒక అంచనాగా చెబుతున్నారు. దీని మీద వైసీపీ కూడా ఉద్యోగులు తమ పక్షం ఉంటారని ధీమాగా ఉందని అంటున్నారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెంట్ ని వినియోగించుకోవడం క్యూలు కట్టి మరీ ఓట్లు వేయడం కూడా ఒక కీలక సంకేతాన్నే ఇస్తోంది అని అంటున్నారు.