Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త జిల్లాలు...32గా పెంచే చాన్స్ !

ఏపీలో కొత్త జిల్లాల మీద చర్చ ఊపందుకుంది. ఇవి మరో ఆరు దాకా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 Jun 2024 3:35 AM GMT
ఏపీలో కొత్త జిల్లాలు...32గా పెంచే చాన్స్ !
X

ఏపీలో కొత్త జిల్లాల మీద చర్చ ఊపందుకుంది. ఇవి మరో ఆరు దాకా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన ఏపీలో పదమూడు దాకా ఉన్న జిల్లాలను వైసీపీ అధికారంలోకి వచ్చాక 26గా చేసింది. అయితే దాని మీద కూడా కొంత రచ్చ జరిగింది. కొంత అసంబద్ధత ఉందని ఆయా ప్రాంతాల వారు విమర్శలు చేశారు.

జిల్లా కేంద్రాలను తమకు ఇవ్వలేదని రాజకీయ పరమైన విమర్శలు కూడా వచ్చాయి. వైసీపీ ఓటమి వెనక కారణాలో ఇది కూడా ఒకటని కూడా చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాల మీద రేగిన వివాదాల మీద ఆనాడే విపక్ష హోదాలో టీడీపీ హామీలు ఇచ్చింది.

మేము అధికారంలోకి వస్తే తప్పులను సవరిస్తామని పేర్కొంది. దాంతో పాటు కొన్ని ప్రాంతాలను కొత్త జిల్లాలుగా చేస్తామని కూడా టీడీపీ పేర్కొంది. ఇపుడు అవీ ఇవీ అన్నీ కలుపుకుంటే ఏకంగా 32 దాకా కొత్త జిల్లాలు ఏర్పడవచ్చు అన్నది ప్రచారంలో ఉన్న మాట.

అంటే తెలంగాణాలో ఉన్న 33 జిల్లాలకు సరిసమానంగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉండబోతోంది అని అంటున్నారు. అంతే కాదు దీని మీద అపుడే చర్చ స్టార్ట్ అయిపోయింది. కొందరు ఉత్సాహవంతులు సోషల్ మీడియాలో జిల్లాలు ఏవి ఎలా ఏర్పడబోతున్నాయి అని పేర్కొంటూ పేర్లతో సహా పెడుతూ పోస్టులు చేస్తున్నారు

మరి పది రోజుల క్రితమే ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఈ చర్చ ఉందా ప్రభుత్వం దీని మీద కసరత్తు చేస్తోందా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే లోతుగా అధ్యయనం చేయకుండా ప్రకటించరు అని అంటున్నారు. దీని కోసం ఎంత సమయం అయినా తీసుకుని పూర్తిగా అందరికీ ఆమోదయోగ్యం అయ్యాకనే చేస్తారు అని అంటున్నారు.

అయితే చంద్రబాబు ప్రభుత్వం కొత్త జిల్లాల విషయంలో ముసాయిదా రెడీ చేసిందని అంటున్నారు. అది అధికారికంగా రిలీజ్ చేయలేదు కానీ బయటకు వచ్చి సర్క్యులేట్ అవుతోంది. దాని ప్రకారం చూస్తే కొత్త జిల్లాలు ఈ విధంగా ఉండవచ్చు అని అంటున్నారు.

మ‌ద‌న‌పల్లెను కొత్త జిల్లాగా పేర్కొంటూ పీలేరు, పుంగ‌నూరు, మ‌ద‌న‌ప‌ల్లి, తంబ‌ళ్ల ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాల‌ను చేర్చారు. అలాగీ ప‌లాసను కొత్త జిల్లా చేస్తూ ఇచ్ఛాపురం, ప‌లాస‌, టెక్క‌లి, పాతప‌ట్నం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలను చేర్చారు.

ఇక రాజ‌మండ్రి కొత్త జిల్లాలో అన‌ప‌ర్తి, రాజాన‌గ‌రం,రంప‌చోడ‌వ‌రం, రాజ‌మండ్రి సిటీ, రూర‌ల్‌, కొవ్వూరు నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటాయని అంటున్నారు. అలాగే కొత్త జిల్లాగా అమ‌రావ‌తిని చేస్తూ అందులో పెద‌కూర‌పాడు, తాడికొండ‌, మంగ‌ళ‌గిరి, జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామల‌తో క‌లుపుతున్నారు.

అలాగే మార్కాపురం జిల్లాగా చేస్తూ ఎర్ర‌గొండ‌పాలెం, మార్కాపురం, గిద్ద‌లూరు, క‌నిగిరి, ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గాలను ఉంచుతారు అని అంటున్నారు. ఇక రాజంపేటను జిల్లాగా చేస్తూ అందులో బ‌ద్వేలు, రాజంపేట‌, రైల్వే కోడూరు, రాయ‌చోటి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలను చేరుస్తున్నారు. ఇలా ఆరు కొత్త జిల్లాలతో ప్రభుత్వం ముసాయిదాను రెడీ చేసిందని అంటున్నారు. దీనిని ప్రజాభిప్రాయం కోసం ఉంచి అందరి ఆమోదం తీసుకున్నాక కొత్త జిల్లాలుగా ప్రకటిస్తారు అని అంటున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు ఇవి కలిస్తే మొత్తం 32 జిల్లాలుగా ఏపీలో ఉంటాయని అంటున్నారు.