టీడీపీ కూటమిలో ఎమ్మెల్యే లకు ఫండ్స్ ఉంటాయా ?
ప్రతీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకునేందుకు ఎమ్మెల్యేలకు ఫండ్స్ అని గత ప్రభుత్వాలు తీసుకుని వచ్చాయి
By: Tupaki Desk | 24 Jun 2024 3:02 PM GMTప్రతీ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకునేందుకు ఎమ్మెల్యేలకు ఫండ్స్ అని గత ప్రభుత్వాలు తీసుకుని వచ్చాయి. దాని వల్ల ఎమ్మెల్యే తన నియోజకవర్గాల పరిధిలో ఏదైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు ఉండేది. అలా ఎమ్మెల్యేలకు విలువ గౌరవం ఉండేది. అంతే కాదు వారు తాము చేసినవి జనాలకు చెప్పుకునేందుకు వీలు ఉండేది.
కానీ జగన్ ప్రభుత్వంలో అలాంటిది ఏమీ లేదని ఎమ్మెల్యేలు చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద ప్రతిపాదనలు పెట్టినా కూడా అమలు కాలేదు. చేద్దాం చూద్దామని కాలం గడిపేశారు. మొత్తం అంతా సెంట్రలైజేషన్ అయిపోయింది. సంక్షేమానికి ప్రభుత్వమే ఖర్చు చేస్తోంది కాబట్టి వేరేగా ఇవ్వాల్సింది లేదు అన్నది గత ప్రభుత్వ ఆలోచనగా ఉండవచ్చు అని అంటున్నారు.
ఏది ఏమైనా ఎమ్మెల్యేలు అయితే ఉత్సవ విగ్రహాల మాదిరిగానే మారిపోయారు. కోట్లు ఖర్చు చేసి గెలిచి వచ్చిన ఎమ్మెల్యే తన అధికారాన్ని ఉపయోగించి ఒక పైసా కూడా ఖర్చు చేసే పరిస్థితి అయితే లేదు. ఇది కూడా వైసీపీలో అసంతృప్తి పెంచేలా చేసింది. జనాలకు ఎమ్మెల్యేలు గుర్తు లేకుండానూ చేసింది
మరి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బంపర్ మెజారిటీతో జనాలు గెలిపించారు. ఈ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు ప్రజలు పెట్టుకున్నారు. అలాగ్గే భారీ ఆధిక్యతతో గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా పెట్టుకున్నారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ కంటే సంక్షేమ పధకాల విషయంలో రెట్టింపు హామీలు ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చింది.
దాంతో గతానికి కంటే పెద్ద ఎత్తున నిధులు వెల్ఫేర్ స్కీమ్స్ కి ఖర్చు చేయాల్సి రావడం ఖజానాకు పెను భారం అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎక్కడ నుంచి వస్తాయన్న ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వంలో అయితే ఒక వీధి లైట్ పోయినా దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవకాశం అయితే అసలు లేదు. ఎందుకంటే వారికి అలాంటి పరిస్థితి ఉంది.
జగన్ ప్రభుత్వం మొత్తం నిధులను సంక్షేమం కోసం ఖర్చు చేసింది. దానికే కేటాయించింది. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా పేరు తెచ్చుకున్నారు. దాంతో ఏపీలో అభివృద్ధి బాబు ప్రభుత్వం చేస్తుంది అన్నది తెలుసు. ప్రజలు కూడా అలాగే విశ్వసిస్తారు. మరి ఏపీలో ప్రభుత్వ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది వేరేగా ఎమ్మెల్యేలకు స్పెషల్ గా డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.
అయితే అభివృద్ధికి పెద్ద పీట వేసే చంద్రబాబు నియోజకవర్గాల స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తారని ఆశించేవారే కూటమిలో ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపధ్యంలోనే ఎమ్మెల్యేలు అంతా చంద్రబాబు తమకు నిధులు ఇచ్చే విషయంలో సీరియస్ గా ఆలోచిస్తారు అని నమ్ముతున్నారు.
అయితే ఏపీలో ఆర్ధిక పరిస్థితి చూస్తే ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. దాంతో పాటు అనేక హామీలు ఇచ్చి మరీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రయార్టీ ఇవ్వాల్సి వస్తే వాటికే ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఒకవేళ ఎమ్మెల్యేలు అడిగినా చంద్రబాబు మనసులో ఇవ్వాలని ఉన్నా కొన్నాళ్ళ పాటు ఆగాల్సి ఉంటుందని అంటున్నారు.
కనీసంగా రెండేళ్ల పాటు అయినా ఆగితే ఏపీ ఒక గాడిన పడితే తప్పకుండా అపుడు చంద్రబాబు నుంచి ఆశించవచ్చు అని అంటున్నారు. ఇక ఎన్నికలకు రెండేళ్ల ముందు ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తే వారి స్థానికంగా పనులు చేసుకోగలుగుతారు అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఎమ్మెల్యేలకు ఫండ్స్ అన్న దానికి మరో మారు చర్చకు తెర లేచింది. దాని మీద కూటమిలో మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఆశతో వెయిట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. బాబు ప్రభుత్వం ఈ విధంగా డెసిషన్ తీసుకుంటుందో.