Begin typing your search above and press return to search.

అమరావతి... బాబుకు అతి పెద్ద సవాల్ !

ఈ నేపధ్యంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి ఏమి చేస్తుంది అన్నది ప్రధాన ప్రశ్నగా ఉంది

By:  Tupaki Desk   |   25 Jun 2024 2:45 AM GMT
అమరావతి... బాబుకు అతి పెద్ద సవాల్ !
X

ఏపీ కలల రాజధానిగా అమరావతి ఉంది. ఏపీలో టీడీపీ కూటమిని 164 సీట్లతో గెలిపించి 98 శాతం స్ట్రైక్ రేట్ ని ఇచ్చిన ప్రజలు అంతా అమరావతి రాజధానికే ఓటేసినట్లుగా భావించాలి. ఏపీలో అమరావతి రాజధానిగా ఉండాలని అంతా పూర్తిగా అభిప్రాయపడుతున్నారు. ఇక భూములు వేలాదిగా ఇచ్చిన రైతులు అయిదేళ్ళుగా ఆందోళనలో ఉన్నారు.

ఈ నేపధ్యంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి ఏమి చేస్తుంది అన్నది ప్రధాన ప్రశ్నగా ఉంది. అమరావతి రాజధాని నిర్మాణం అంటే అది చాలా పెద్ద బడ్జెట్ గానే చూడాలి. అయితే అమరావతికి మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ భవనాలు కొన్ని నిర్మించి వదిలిపెడితే కాలక్రమంలో అది అభివృద్ధి చెందుతుంది.

ఇక్కడ ప్రజలతో పాటు అంతా చూడాల్సింది ఏంటి అంటే అమరావతి కేవలం అయిదేళ్లలో అద్భుత నగరంగా అవుతుందని ఆశలు పడకపోవడం. ఎందుకంటే ఈ అయిదేళ్ళూ చాలా తక్కువ సమయం. చంద్రబాబు అనుభవశాలిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే మాత్రం అమరావతి రాజధాని పరిపూర్తికి నిధులు పెద్ద ఎత్తున కావాల్సి ఉంది. ఇది అంతా కాలక్రమంలో జరగాలి.

చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో చేసిన ఆలోచనలకు వైసీపీ ప్రభుత్వం ఎంతో కొంత ముందుకు తీసుకుని వెళ్తే దానికి ఈ ప్రభుత్వం కొనసాగించి ఉండేది. కానీ అమరావతిలో అలా జరగలేదు. దానికి ఉదాహరణలు చూస్తే దాదాపుగా డెబ్బై శాతం పైగా పూర్తి అయిన ఉద్యోగుల నివాసాలను వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో అక్కడ తుప్పలు పెరిగి అది అడవిగా మారింది. మళ్లీ దానికి ఒక రూపూ షేపూ తేవాలీ అంటే ఇంతకు ఇంత ఖర్చు అవుతుంది.

అలాగే అమరావతిలో శాశ్వత సచివాలయం నిర్మాణం కోసం గతాంలో టీడీపీ ప్రభుత్వం నిర్మాణాలు మొదలెట్టింది. అవి కొంత జరిగాక గత ప్రభుత్వం దిగిపోయింది. అయితే ఆ తరువాత అయిదేళ్ళలో వానలు వరదలు వచ్చి ఆ నిర్మాణాలు అన్నీ నీటమునిగాయి. ఇపుడు వాటి నిర్మాణ నాణ్యత ఎలా ఉందో చూడాలి. దాని మీద మళ్లీ కొత్తగా మొదలెట్టాలా లేదా చూసుకోవాలి. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి.

అమరావతిలో రైతుల నుంచి సేకరించింది 33 వేల ఎకరాలు. అలాగే ప్రభుత్వ భూమి 22 వేల ఎకరాలు. అన్నీ కూడితే 55 వేల ఎకరాలు ఇందులో 33 వేల ఎకరాలను ప్లాట్లుగా అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలి. అది జరగాలీ అంటే రోడ్లు, డ్రైనేజ్, మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలి. మొత్తం 55 వేల ఎకరాలకు లక్షన్నర దాకా ఖర్చు కావచ్చు. అందులో ప్రయారిటీ పెట్టుకుని రైతుల భూములే అభివృద్ధి చేసి ఇవ్వాలన్నా లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గతంలో నిర్మాణాలు కొంత చేసి మధ్యలో ప్రభుత్వం మారడంతో పక్కకు తప్పుకున్న నిర్మాణ సంస్తలను చంద్రబాబు పిలిపించి మాట్లాడుతున్నారు. వారితోనే తిరిగి పనులు మొదలెట్టాలని చూస్తున్నారు. అయితే ప్రభుత్వం వద్ద అమరావతి నిర్మాణాలకు అర్జెంటుగా లక్ష కోట్లు ఉండాల్సి ఉంది. కానీ అంత మొత్తం లేదు అన్నది ఖజానాను చూస్తే చెప్పేయవచ్చు.

ఏపీ బడ్జెట్ లక్షన్నర కోట్ల నుంచి రెండు లక్షల దాకానే ఉంటుంది. ఇందులో అమరావతికి లక్ష కోట్లు ఏకమొత్తంగా ఇవ్వడం కుదరని పని. అందుకే జీఎస్టీ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి కోసం 15 వేల కోట్లు ప్రత్యేక గ్రాంట్ గా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. మరి కేంద్రం సుముఖత వ్యక్తం చేసి నిధులు విడుదల చేస్తే కొంతలో కొంత ఊరట. నిర్మాణం పనులు మొదలెట్టడానికి వీలు అవుతుంది.

ఆ తరువాత రాష్ట్ర ఆదాయం నుంచి కొంతలో తీసి పెట్టి అమరావతికి వెచ్చించాల్సి ఉంటుంది. లేదా మిగులు భూములు అమ్మాల్సి ఉంటుంది. ఏది అమ్మాలనుకున్నా ముందు అక్కడ ఎంతో కొంత అభివృద్ధి చేసి చూపించకపోతే అనుకున్న రేటు డిమాండ్ రావు అని అంటున్నారు. ఏది ఏమైనా అమరావతి టీడీపీకి ప్రత్యేకించి చంద్రబాబుకు అతి పెద్ద సవాల్ అని అంటున్నారు.

ఈ అయిదేళ్ళలో రైతుల వరకేనా అభివృద్ధి చేసి ప్లాట్స్ ఇచ్చినా చంద్రబాబు సెంట్ పర్సెంట్ విజయం సాధించినట్లే అంటున్నారు. ఆ తరువాత అమరావతి నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. మొత్తం మీద కేంద్రం అమరావతి మీద దయ చూపాల్సి ఉంది. ఇక ప్రపంచ బ్యాంక్ నిధులు తెస్తామని అంటున్నారు. ఏవి తెచ్చినా అప్పులకు వడ్డీలు కట్టడం కూడా చూసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఏపీ అప్పుల కుప్పగా ఉంది. మొత్తానికి అమరావతి ఏపీ సర్కార్ కి ఒక టఫ్ సబ్జెక్ట్ అని చెప్పక తప్పదు.