ఇక జబర్దస్త్ రోజా వంతు..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా, అదేవిధంగా మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్‌లపై సీఐడీకి ఫిర్యాదులు అందాయి.
By: Tupaki Desk | 15 Aug 2024 4:49 PM GMTవైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా, అదేవిధంగా మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్‌లపై సీఐడీకి ఫిర్యాదులు అందాయి. దీంతో వారి విషయం తేల్చాలంటూ.. సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఎన్నికలకు ముందు వరకు .. గత ఐదేళ్లలో టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, ఆయన కుమారు డు మంత్రి నారా లోకేష్‌లకు వ్యతిరేకంగా రోజా విరుచుకుపడిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఎన్నికల తర్వాత.. రోజా సైలెంట్ అయిపోయారు.
ఎక్కడా పన్నెత్తు మాట కూడా అనడం లేదు. దీనికి కారణం.. గతంలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవకతవకలేనని రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది. ఇప్పుడు అలాంటి ఆరోపణలతోనే కబడ్డీ జాతీయ క్రీడాకారుడు(మాజీ) ఆర్. డీ. ప్రసాద్ రోజా, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌లపై గత జూన్‌లోనే ఫిర్యాదు చేశారు. వైసీపీహయాంలో చేపట్టిన ఆడుదాం-ఆంధ్రా కార్యక్రమం ద్వారా భారీ అవినీతికి పాల్పడ్డారని.. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అప్పట్లో నిర్వహించిన ఆడుదాం-ఆంధ్ర కార్యక్రమం పై విచారణ జరిపి.. నిగ్గు తేల్చాలని కూడా.. ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిని స్వీకరించిన సీఐడీ అధికారులు తాజాగా విజయవాడ పోలీసు కమిషనర్‌కు కేసు నమోదు చేయాలని పేర్కొంటూ.. మెమో జారీ చేశారు. విజయవాడకు చెందిన ఆర్.డి. ప్రసాద్ ఫిర్యాదు చేశారని, ఈ మేరకు రోజా, ధర్మాన కృష్ణ దాస్‌లపై కేసులు పెట్టేందుకు ఆదేశించారు. ఇదే జరిగితే.. రోజా, కృష్ణదాస్‌లు కూడా విచారణకు సిద్ధం కావాల్సి ఉంటుంది.
ఇక, ఇప్పటికే జోగి రమేష్ టీడీపీ అధినేత ఇంటిపై దాడి కేసులోను, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, నందిగం సురేష్ వంటివారు కేసులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల కేసులో చిక్కుకుని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు రోజా , ధర్మానల వంతు వచ్చిందన్న చర్చ సాగుతోంది.