చిన్న నిర్ణయం.. అందరి మనసుల్ని దోచేసిన బాబు
మాటలు చెప్పే చంద్రబాబు చేతల విషయానికి వచ్చేసరికి తప్పులు చేస్తుంటారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది
By: Tupaki Desk | 12 Jun 2024 6:45 AM GMTమాటలు చెప్పే చంద్రబాబు చేతల విషయానికి వచ్చేసరికి తప్పులు చేస్తుంటారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్న మరోలా వ్యవహరించటం ఆయనకు అలవాటుగా మండిపడుతుంటారు ఆయన ప్రత్యర్థులు. గతం సంగతి ఎలా ఉన్నా వర్తమానంలో మాత్రం ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండటం లేదు. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పేరు ప్రఖ్యాతుల కోసం తపన పడకుండా.. విపక్ష నేతగా ఉన్నప్పుడు తానేం మాట్లాడారో తాజాగా చేసి చూపించటంఆసక్తికరంగా మారింది.
కక్షపూరిత రాజకీయాలు వద్దంటూనే.. తప్పులు చేసిన వారి విషయంలో ఉదాసీనంగా ఉండమని.. చట్టప్రకారం చర్యలు తప్పవని తేల్చేశారు. ఏదైనా రూల్ ప్రకారమే చేస్తామే తప్పించి.. అడ్డదిడ్డంగా చేయమన్న విషయాన్ని స్పష్టం చేశారు. తాను చెప్పే మాటల్ని చేతల్లో చేసి చూపిస్తున్నారు. అంతేకాదు.. చిన్న చిన్న విషయాల్లోనూ ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారులకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫారంలు.. షూస్.. పుస్తకాలు ఇతర వస్తువుల్ని ఉచితంగా అందించేవారు. అంతేకాదు.. స్కూళ్లలో చిక్కీలు మొదలుకొనిపలు తినుబండారాల్ని ఇచ్చేవారు. వీటిపైన జగన్ ఫోటో మస్ట్ గా ఉండేది. తాజాగా అధికారంలోకి రానున్న చంద్రబాబు.. గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల్ని ఆపేయాలన్న ఆలోచనలో లేదన్న విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్ని అమలు చేయటం చేస్తున్నారు. యూనిఫారంలు.. పుస్తకాలు.. బ్యాగులను ఇప్పుడు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో.. చిక్కీలు లాంటి తినుబండారాలపై జగన్ ఫోటో ఉండేది. దాని స్థానే ఏపీ రాజముద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అదే సమయంలో తన ఫోటోకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా రాజముద్రను అచ్చేయటం ద్వారా చంద్రబాబు అందరి మనసుల్ని దోచేస్తున్నారు.
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లోగత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల్ని.. అధికారంలోకి వచ్చినంతనే ఆపేయటం లాంటి పనుల్ని చేయమన్న బలమైన సంకేతాన్ని తాజా నిర్ణయంతో చంద్రబాబు తేల్చి చెప్పినట్లుగా చెప్పాలి. గత ప్రభుత్వం అమలు చేసే జగనన్న విద్యా కానుక పేరు మారుతుందే తప్పించి.. స్కూల్ పిల్లలకు ఇచ్చే కానుకను మాత్రం కంటిన్యూ చేస్తారు. అదే సమయంలో.. గత సర్కారు హయాంలో విద్యా కానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపై విచారణ చేయాలని మాత్రం నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ అధికారంలోకి వచ్చినంతనే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఆపేశారు. అయితే.. జగన్ సర్కారు చేపట్టిన పథకాల్ని అమలు చేస్తున్న చంద్రబాబు కొత్త సంస్క్రతికి తెర తీశారని చెబుతున్నారు.