Begin typing your search above and press return to search.

అమరావతి సందడిలో విశాఖ స్టీల్ ని మరిచిన కూటమి నేతలు ?

ఈ బడ్జెట్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు అని తీపి కబురు వస్తుందని అంతా భావించారు.

By:  Tupaki Desk   |   26 July 2024 3:30 AM GMT
అమరావతి సందడిలో విశాఖ స్టీల్ ని మరిచిన కూటమి నేతలు ?
X

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయబోమని ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు తెలుగుదేశం నేతలు కూడా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటామని ప్రకటించారు. ఈ బడ్జెట్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు అని తీపి కబురు వస్తుందని అంతా భావించారు.

కానీ అలాంటిది ఏమీ లేకుండా పోయింది. దాంతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగ సంఘాలు కేంద్ర బడ్జెట్ మీద మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికే కేంద్రం నిర్ణయించుకుందని అర్ధం అవుతోందని కూడా వారు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో కూటమి నేతలు కూడా మాట్లాడకపోవడం మీద గుస్సా అవుతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించలేదని గుర్తు చేస్తున్నారు. విశాఖ ప్లాంట్ ని సొంతంగా నిర్వహించకపోతే సెయిల్ లో విలీనం చేయాలని కోరినా స్పందన లేకపోవడం పట్ల స్టీల్ ప్లాంట్ కార్మిక సంగాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మరో వైపు చూస్తే కేంద్ర బడ్జెట్ అధ్బుతం అని టీడీపీ కూటమి పెద్దలు సంబరాలు చేసుకుంటున్నాయని విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ఏమీ చేయలేదని ఎందుకు గుర్తించరని వారు ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయినా పట్టదా అని నిలదీస్తున్నారు. కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదని విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా కేంద్రం నుంచి అనుకూల స్పందన రాలేదని నిధులు కూడా కేటాయింపు పెద్దగా లేదని ఎత్తి చూపుతున్నారు.

విభజన చట్టంలో రైల్వే జోన్ ఉన్నా పదేళ్ళు గడచినా అతీ గతీ లేదని అంటున్నారు. ఉత్తరాంధ్రాకే కాదు ఏపీకే కేంద్రం మరోసారి మోసం చేసిందని వామపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. హామీలు ఇవ్వడం తప్ప ఆచరణకు నోచుకున్న పాపాన పోలేదని అంటున్నారు. ఈసారి బడ్జెట్ లో ఏమి గొప్ప ఉందని వారు అంటున్నారు.

అమరావతి రాజధానికి నిధులు అంటూ అప్పులు ఇస్తున్నారని అదే గొప్ప అని కూటమి నేతలు హర్షం వ్యక్తం చేయడమేంటని సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా ఉంటే విశాఖకు చెందిన టీడీపీ ఎంపీ శ్రీభరత్ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

ప్రైవేటీకరణ జాబితా నుంచి 200 సంస్థలను వెనక్కి తీసుకుంటామని కేంద్రం ప్రకటించిందని ఆ లిస్ట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని చేర్చాలని శ్రీభరత్ కేంద్రాన్ని కోరారు. దీని మీద కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ కేంద్ర బడ్జెట్ చూసిన తరువాత విశాఖ స్టీల్ కార్మికులలో మాత్రం డౌట్లు మరింతగా పెరిగిపోయాయని అంటున్నారు.