Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి 'అమ్మో ఒకటో తారీకు'!... ఆగస్ట్ పరిస్థితి ఇదేనా?

అవును... ఒకటో తారీకు వస్తుందంటే చాలు ఏపీలో ప్రభుత్వ పెద్దలకు సరికొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 July 2024 5:18 AM GMT
ఏపీ ప్రభుత్వానికి అమ్మో ఒకటో తారీకు!... ఆగస్ట్  పరిస్థితి ఇదేనా?
X

ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదని.. “సూపర్ సిక్స్” పథకాలు అమలు విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని.. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఇప్పటికే చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రజానికానికి అప్పీల్ చేశారు! ఇప్పటికే "తల్లికి వందనం" పథకాన్ని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యింది! మరోపక్క, ప్రభుత్వానికి 'అమ్మో ఒకటో తారీకు' అనే పరిస్థితి అని అంటున్నారు!

అవును... ఒకటో తారీకు వస్తుందంటే చాలు ఏపీలో ప్రభుత్వ పెద్దలకు సరికొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఆ తేదీనే దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు ప్రభుత్వానికి ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఒకటో తేదీ వచ్చిందంటే.. సామాజిక భద్రతా పెన్షన్లు, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు వేయాల్సి ఉంటుంది.

వాస్తవానికి గతంలో జగన్ హయాంలో.. సామాజిక భద్రతా పెన్షన్లు మాత్రం ఒకటో తేదీనే అందించేవారు కానీ... ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు మాత్రం ఆలస్యంగా ఇచ్చేవారు. దీంతో... ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. ఎన్నికల్లోనూ ఈ ప్రభావం స్పష్టంగా కనిపించిందని అంటారు. అయితే... కూటమి సర్కార్ కి కూడా ఈ సమస్య తప్పేలా లేదనే చర్చ మొదలైంది!

జగన్ హయాంలో పెన్షన్ రూ.3000 గా ఉంది. అంతకు మించి ఇప్పట్లో పెంచడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాత్రం కూటమి అధికారంలోకి వస్తే రూ.4000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దానికి తోడు మూడు నెలల ఏరియర్స్ కూడా కలిపి జూలై 1న రూ.7000 చొప్పున ఇచ్చారు. దానికి సుమారు. ఏడు నుంచి తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో... మరో మూడు నాలుగు రోజుల్లో ఆగస్ట్ 1వ తేదీ రానుంది. ఈ సమయంలో కూడా సాధారణ పెన్షన్ రూ.4 ఏలు, దివ్యాంగ పెన్షన్ రూ.6 వేలు, ఇతర వ్యాధిగ్రస్తులకు రూ.10వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీంతో... వీటికే సుమారు నాలుగు వేల కోట్లు అవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో... అదే రోజు ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి.

అయితే... ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని.. ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లకు సొమ్ము లేదని అంటున్నారు. అయితే... మంగళవారం (జూలై 30)న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే వేలంలో పాల్గొని సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో ఓ నాలుగు వేల కోట్లు సమీకరించేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

ఆ నిధులు కూడా వస్తే ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి అందించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అలాకాని పక్షంలో జగన్ సర్కార్ మాదిరిగానే ముందుగా సామాజిక పెన్షన్స్ ఇచ్చేసి, తర్వాత జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఏమి జరగనుందనేది వేచి చూడాలి!!