‘ఆ ఐపీఎస్’లకు అట్టెండన్స్ పనిష్మెంట్?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఐపీఎస్ అధికారులు వివాదాస్పదులయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Aug 2024 11:22 AM GMTఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఐపీఎస్ అధికారులు వివాదాస్పదులయిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ అధికారులకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వలేదు. వారిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
తాజాగా కూటమి ప్రభుత్వం పోస్టులు ఇవ్వని 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రతి రోజూ డీజీపీ హెడ్ క్వార్టర్లలో రిపోర్టు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ 16 మంది ఐపీఎస్ అధికారుల్లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, మాజీ విజిలెన్స్ చీఫ్ కొల్లి రఘురామిరెడ్డి, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్పీలుగా, డీఐజీలుగా పనిచేసిన అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణ కాంత్ పటేల్, పాలరాజులు ఉన్నారు.
వీరందరికీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లాలని సూచించారు.
ఈ అధికారులకు ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. వీరంతా వెయిటింగ్ లో ఉన్నారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే వెయిటింగ్ లో ఉంటూ అందుబాటులో ఉండని ఈ 16 మంది ఐపీఎస్ లు ఇక రోజూ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు వారికి మెమోలు జారీ చేశారు.
ఏ పోస్టూ లేకుండా వెయిటింగ్ లో ఉండి హెడ్‌క్వార్టర్స్ లో అందుబాటులో లేనివారికి మెమోలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ 16 మంది ప్రతి రోజూ డీజీపీ ఆఫీసుకు వెళ్లి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో ఉండనున్నారు.