రాజధాని అమరావతికి కేంద్రం బూస్ట్!
కేంద్రంలో కూడా టీడీపీ, జనసేన పార్టీల మద్దతుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడటం అమరావతికి కలసి వస్తోంది.
By: Tupaki Desk | 6 July 2024 12:31 PM GMTఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతికి మంచి రోజులొస్తున్నాయి. కేంద్రంలో కూడా టీడీపీ, జనసేన పార్టీల మద్దతుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడటం అమరావతికి కలసి వస్తోంది.
ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఇందులో 189 కి.మీ. పొడవైన అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) వంటి ముఖ్యమైన ప్రాజెక్టులున్నాయి.
కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీని, ఆరుగురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీ అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చే శారు. అలాగే ఆర్థిక సంఘం చైర్మన్, నీతిఆయోగ్ సీఈవోలతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి రింగు రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవేలకు ఆయా మంత్వ్రిత్వ శాఖల నుంచి అనుమతులు పొందారు.
కేంద్ర ఉపరితల రవాణా శాఖ స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీ, ప్రధానమంత్రి తుది ఆమోదం లభిస్తే అమరావతి రింగు రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవేల పనులు ప్రారంభమవుతాయి. అమరావతి ఔటర్ రింగు రోడ్డుకు భూసేకరణ సహా పనులకు మొత్తం రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వ్యయానికి సంబంధించిన పనులకు కేంద్రం అంగీకారం తెలిపింది.
అలాగే విజయవాడలో రద్దీని తగ్గించడానికి ఉద్దేశించిన విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.
అలాగే రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులు.. అమరావతి – హైదరాబాద్ మధ్య ఇప్పుడున్న దూరాన్ని 60–70 కి.మీ. తగ్గించడానికి ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్సప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్సప్రెస్ వేని అమరావతితో అనుసంధానిస్తూ... మేదరమెట్ల–అమరావతి మధ్య 90 కి.మీ. పొడవైన గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనకు కూడా కేంద్రం సమ్మతించింది.
కాగా ఓఆర్‌ఆర్ ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సీఆర్‌డీఏ పరిధిలో 189 కి.మీ. మేర ఆరు వరుసలతో నిర్మించనున్నారు. దీనికి అన్ని ఖర్చులు కలిపి రూ.30 వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంటున్నారు.
ఓఆర్‌ఆర్ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే... రెండు మూడేళ్లలోనే రాజధాని అమరావతి సమగ్రంగా అభివృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నాయి.