Begin typing your search above and press return to search.

వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ-'హెలికాప్ట‌ర్ రాజ‌కీయం'

ఖ‌జానాలో రూపాయి క‌నిపించ‌డం లేద‌ని.. అప్పులు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయ‌ని చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 3:30 PM GMT
వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ-హెలికాప్ట‌ర్ రాజ‌కీయం
X

అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీల మ‌ధ్య హెలికాప్టర్ రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ దూకుడుగా విమ‌ర్శ‌లు చేస్తూ.. శ్వేత ప‌త్రాల రూపంలో జ‌గ‌న్‌ను ఏకేసిన విష‌యం తెలిసిందే. రాష్ట్ర ఖ‌జానాను ఖాళీ చేశార‌ని, దౌర్భాగ్య పాల‌న‌తో రాష్ట్రాన్ని విధ్వంసం చేశార‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పు కొస్తున్నారు. అందుకే సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌ను చూస్తుంటే భ‌యం వేస్తోంద‌ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఖ‌జానాలో రూపాయి క‌నిపించ‌డం లేద‌ని.. అప్పులు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయ‌ని చెప్పుకొచ్చారు.

ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం చిన్న‌పాటి దూరాల‌కు కూడా హెలికాప్ట‌ర్‌ను వినియోగించిన విష‌యాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించిన విష‌యం తెలిసిందే. కేవ‌లం 5 కిలో మీటర్ల దూరాన్ని కూడా కారులో ప్ర‌యాణం చేయ‌లేని యువ ముఖ్య‌మంత్రి అంటూ సెటైర్లు వేశారు. ఇది కూడా నిజమే. అప్ప‌ట్లో జ‌గ‌న్ ఏ చిన్న‌పాటి ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చినా హెలికాప్ట‌ర్ వినియోగించి.. రూ. ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. దీనిపై విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు చంద్ర‌బాబు వ‌చ్చింది. చంద్ర‌బాబు అధికారం చేప‌ట్టిన 62 రోజుల్లో 23 సార్లు హెలికాప్టర్ వినియోగించార‌న్న‌ది వైసీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌. పైగా.. అత్యంత త‌క్కువ దూరాల‌కు ఆయ‌న కూడా హెలికాప్ట‌ర్ వినియోగించార‌ని.. అప్పుడు చెప్పిన నీతులు ఇప్పుడు ఏమ‌య్యాయంటూ.. సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసం నుంచి స‌చివాల‌యానికి (3.5 కిలోమీట‌ర్ల దూరం) కూడా హెలికాప్ట‌ర్‌పై వెళ్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

అలానే.. ఎప్పుడు విమానాశ్ర‌యానికి వెళ్లాల్సి వ‌చ్చినా.. ఉండ‌వ‌ల్లి నుంచి 23 కిలో మీట‌ర్ల దూరంలోని గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి హెలికాప్ట‌ర్‌నే వినియోగిస్తున్నార‌ని లెక్క‌ల‌తో స‌హా వైసీపీ సోష‌ల్ మీడియా వెల్ల‌డించింది. ఒక‌వైపు ఖ‌జానా ఖాళీ అంటూనే మరోవైపు ఇలా.. ఇష్టానుసారంగా హెలికాప్ట‌ర్‌ను వినియోగించ‌డం ఏంటన్న‌ది వైసీపీ నాయ‌కులు సంధిస్తున్న ప్ర‌శ్న‌. అంతేకాదు.. గ‌తంలో జ‌గ‌న్‌ను విమ‌ర్శించిన చంద్ర‌బాబు వాటిని మ‌రిచిపోయారా? అని నిల‌దీస్తున్నారు. దీనికి టీడీపీ ఎలాంటి కౌంట‌ర్ ఇస్తుందో చూడాలి.