అన్యమతస్తుల ఉద్యోగాలపై స్పష్టత ఇచ్చిన కోర్టు
అన్యమతస్తులు హిందు దేవాలయాల్లో ఉద్యోగాలు చేసే విషయంలో హైకోర్టు ఇంతకాలానికి స్పష్టమైన తీర్పిచ్చింది
By: Tupaki Desk | 19 Nov 2023 6:13 AM GMTఅన్యమతస్తులు హిందు దేవాలయాల్లో ఉద్యోగాలు చేసే విషయంలో హైకోర్టు ఇంతకాలానికి స్పష్టమైన తీర్పిచ్చింది. హిందు దేవాలయాల్లో అన్యమతస్తులు ఎవరూ ఉద్యోగాలు చేయటానికి వీలులేదని స్పష్టంగా ఆదేశించింది. తాజాగా శ్రీశైలం దేవాలయంలో 2002లో సుదర్శనబాబు అనే వ్యక్తి ఉద్యోగంలో చేరాడు. 2010లో క్రిస్తియన్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత క్రిస్తియన్ అయిన సుదర్శనబాబుకు శ్రీశైలం దేవాలయంలో ఉద్యోగం ఇవ్వకూడదనే ఫిర్యాదు అందింది. ఫిర్యాదును పరిశీలించిన అధికారులు అతన్ని ఉద్యోగంలో నుండి తొలగించారు. దాంతో 2012లో సుదర్శన్ కోర్టులో కేసువేశారు. ఆ కేసులోనే హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది.
విషయం ఏమిటంటే సుదర్శన్ హిందు, ఎస్సీ మాట వర్గానికి చెందిన వ్యక్తి. 2010లో క్రిస్తియన్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కేసు విచారణలో ఇదే విషయాన్ని పిటీషనర్ వాదించాడు. క్రిస్తియన్ అమ్మాయిని వివాహం చేసుకున్నంత మాత్రాన తాను క్రిస్తియన్ ఎలాగ అవుతానని వాదించాడు. అయితే అతని వాదన తప్పని అధికారులు నిరూపించారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఉద్యోగంలో చేరేటప్పటికే సుదర్శన్ క్రిస్తియన్. ఆ విషయాన్ని దాచిపెట్టి కేవలం హిందు, ఎస్సీ, మాల అని మాత్రమే చెప్పాడు.
అప్పట్లో అధికారులు కూడా ఉద్యోగం ఇచ్చేశాడు. అయితే తన వివాహం క్రిస్తియన్ పద్దతిలో చర్చిలోనే జరిగింది. మామూలూగా మతాంతర వివాహం చేసుకుంటే దాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయాలి. కానీ ఇక్కడ సుదర్శన అలా కాకుండా మామూలు పద్దతిలోనే రిజిస్టర్ చేయించారు. అంటే ఇద్దరు క్రిస్తియన్లు కాబట్టే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయించలేదు. పైగా వివాహం జరిగిన చర్చిలో ఇద్దరు క్రిస్తియన్లన్నట్లుగానే సుదర్శన్ సంతకం చేశారు.
ఈ రికార్డులన్నింటినీ అధికారులు కోర్టు ముందుంచటంతో దేవాలయంలో సుదర్శన్ ఉద్యాగానికి అనర్హుడని కోర్టు తీర్పిచ్చింది. ఇదే సమయంలో అన్యమతస్తులు ఎవరు హిందు దేవాలయాల్లో ఉద్యోగాలు చేయటానికి వీల్లేదని స్పష్టంగా తీర్పిచ్చింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం తప్పనిసరిగా పాటిస్తే భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావుండదు. లేకపోతే ఇలాగే కోర్టుల చుట్టూ తిరగాల్సుంటుంది.