ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో వివరాల సమర్పణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది.
By: Tupaki Desk | 5 Feb 2024 2:30 PM GMTపర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది.
ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని ఏపీ ౖహె కోర్టు పేర్కొంది. అలా వివరణ తీసుకోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని నిలదీసింది. అలా చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది. సంబంధిత పోలీసు అధికారి అరెస్టుకు ఆదేశాలు ఇస్తామని వ్యాఖ్యానించింది. ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేట్లు లేదని స్పష్టం చేసింది.
పోలీసులు అరెస్టు చేస్తారని భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని హైకోర్టు ప్రశ్నించింది. అరెస్ట్ చేయనివ్వండి.. అందుకు బాధ్యులైన అధికారులు పరిణామాలు ఎదుర్కొంటారని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించని అధికారులను లోపలకి పంపిస్తామని హెచ్చరించింది. ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో వివరాల సమర్పణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది.
పర్చూరు నియోజకవర్గంలో కొద్ది రోజుల క్రితం టీడీపీ నేతల గ్రానైట్ పరిశ్రమలే లక్ష్యంగా ఏపీ గనుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే అధికారుల కార్లలో వైసీపీ నేతలు వచ్చారని.. వారితో మారణాయుధాలు తెచ్చారని టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల పరిశ్రమల్లో తనిఖీలు చేయకుండా టీడీపీ నేతల పరిశ్రమల్లోనే తనిఖీలు చేయడం ఏమిటని నిలదీశారు.
అధికారుల తనిఖీల సమాచారం అందుకున్న పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అక్కడికి వచ్చి అధికారులను నిలదీశారు. వైసీపీ నేతలను, మారణాయుధాలను మీ కార్లలో ఎలా తెచ్చారని ప్రశ్నించారు. దీంతో అధికారులు తమ విధులను అడ్డుకున్నారని, తమపై దౌర్జన్యం చేశారని ఎమ్మెల్యే పర్చూరు సాంబశివరావుతోపాటు పలువురు టీడీపీ నేతలపై కేసు పెట్టారు. దీంతో పోలీసులు పర్చూరు సాంబశివరావుతోపాటు పలువురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సాంబశివరావు తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.