Begin typing your search above and press return to search.

ఏపీ ప్రజలు బూతులు సహించరా?

ముఖ్యంగా బూతుల నేతలుగా ముద్ర పడ్డ కొడాలి నాని, రోజా, సీదిరి అప్పలరాజు, జోగి రమేశ్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరుల పైన ఉన్న ఆగ్రహానికి వైసీపీ బలయిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 Jun 2024 12:30 AM GMT
ఏపీ ప్రజలు బూతులు సహించరా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలో ఉన్న వైసీపీ ఈ స్థాయిలో ఘోరంగా ఓటమి పాలవుతుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. వివిధ సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ సైతం అత్యధికం వైసీపీనే అధికారంలోకి వస్తాయని అంచనాలు వెలువరించాయి. చివరకు కాస్త విశ్వసనీయత ఉన్న ఆరా మస్తాన్‌ కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఫలితాల వెల్లడి తర్వాత వైసీపీకి దిమ్మతిరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అధికారంలో ఉండి ఇంత దారుణంగా ఓడిపోయిన పార్టీగా వైసీపీ చరిత్రకెక్కింది. కేవలం 11 స్థానాలకే కుప్పకూలింది. వైఎస్‌ జగన్‌ మినహాయించి గెలిచిన మిగిలిన పది మంది మెజార్టీలు కూడా పెద్ద గొప్పగా లేకపోవడం గమనార్హం.

తాము 2.70 లక్షల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లో వివిధ పథకాల కింద జమ చేశామని చెప్పుకున్న వైసీపీకి ఈ పరాజయంతో ముఖాన నెత్తురు చుక్క లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతగా వైసీపీని ముంచేసిన ప్రధాన కారణాలేమిటి అంటే ప్రధానంగా వినిపిస్తోంది.. వైసీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల బూతులు, తిట్ల దండకాలు.

ఒక పార్టీ విధానాలు, వ్యక్తులు నచ్చకపోతే సైద్ధాంతికపరంగా విమర్శించొచ్చు.. దీన్ని ఎవరూ తప్పుపట్టరు. అలా కాకుండా కొందరు వైసీపీ నేతలు విమర్శంటే బూతులే అన్నట్టు ప్రవర్తించారని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కొడాలి నాని, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ, దువ్వాడ శ్రీనివాస్, అనిల్‌ కుమార్‌ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సీదిరి అప్పలరాజు, జోగి రమేశ్, పోసాని కృష్ణమురళి, గోరంట్ల మాధవ్‌ ఇష్టానుసారం బూతులతో చెలరేగారనే విమర్శలు ఉన్నాయి.

ఇక వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న పంచ్‌ ప్రభాకర్, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్‌ కుమార్‌ వంటివారు సోషల్‌ మీడియా, యూట్యూబ్‌ చానెల్స్‌ వేదికగా ప్రతిపక్ష నేతలను బండ బూతులు తిట్టారు. ఈ బూతుల వల్లే వైసీపీ మీద ప్రజల్లో ఏహ్య భావం, అసహ్యం ఏర్పడ్డాయనే టాక్‌ వినిపిస్తోంది.

ముఖ్యంగా జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సతీమణి, వారి పసి పిల్లలను కూడా వదలకుండా అత్యాచారం చేస్తామంటూ వైసీపీ నేతలు పేట్రేగిపోవడం ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగించిందని అంటున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిని లక్ష్యంగా చేసుకుని నిండు అసెంబ్లీలో దారుణ వ్యాఖ్యలు చేయడం.. వాటిని వింటూ కూడా వైసీపీ అధినేత, సీఎం జగన్‌ ఖండించకపోవడం కూడా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రేగడానికి కారణమయ్యాయనే వాదన వినిపిస్తోంది.

ముఖ్యంగా గొడవలు, అల్లర్లకు చాలా వరకు దూరంగా ఉండే ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు వైసీపీ నేతల బూతులను హర్షించలేకపోయారని అంటున్నారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తుంటే వారి వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా, వారి సతీమణులే లక్ష్యంగా వైసీపీ నేతలు బూతులతో విరుచుకుపడటం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసిందని చెబుతున్నారు.

ఇష్టానుసారం నోటి వాచాలత్వాన్ని ప్రదర్శించే నాయకులకు జగన్‌ అడ్డుకట్టక వేయకపోగా స్వయం ఆయనే పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని పదే పదే నలుగురు పెళ్లాలు అంటూ మాట్లాడటం కూడా ప్రజలకు నచ్చలేదని అంటున్నారు. పైగా బూతులు తిట్టేవాళ్లకు ప్రోత్సాహమన్నట్టు చంద్రబాబు ఇంటిపైకి భారీ కాన్వాయ్‌ తో దాడికి వెళ్లిన జోగి రమేశ్‌ కు మంత్రి పదవిని కట్టబెట్టడం వివాదాస్పదమైంది.

ముఖ్యంగా బూతుల నేతలుగా ముద్ర పడ్డ కొడాలి నాని, రోజా, సీదిరి అప్పలరాజు, జోగి రమేశ్, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరుల పైన ఉన్న ఆగ్రహానికి వైసీపీ బలయిందని అంటున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌ లను లక్ష్యంగా చేసుకుని బూతులు తిడుతున్న నేతలకు బుద్ది చెప్పాలని ప్రజలు నిర్ణయించుకోవడం వల్లే వైసీపీ ఈ స్థాయిలో ఘోరంగా పతనమైందని టాక్‌ నడుస్తోంది.

తన సతీమణిని అవమానించడంతో చంద్రబాబు బహిరంగంగా కన్నీరు పెట్టుకోవడం, పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై పదే పదే దాడి చేయడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయని అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. ఎప్పుడు వీరికి బుద్ధి చెబుదామా అన్నట్టు ప్రజలు ఓటేయడానికి ఎదురు చూశారని చెబుతున్నారు. దేశవిదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవారు ప్రధానంగా ఈ బూతుల రాయుళ్లకు బుద్ధి చెప్పడానికే వచ్చారని అంటున్నారు. ఇంత సంక్షేమ పథకాలు అమలు చేసినా కడివెడు పాలను విషం చేయడానికి ఒక్క విషపు చుక్క చాలన్నట్టు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల మేలంతా బూతుల రాయుళ్లతో కొట్టుకుపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.