Begin typing your search above and press return to search.

చెవిలో ఫోన్.. చంకలో వాటర్ హీటర్.. ఖమ్మంలో విషాదం!

ఖమ్మం పట్టణంలోని కాల్వ ఒడ్డున ఉన్న హనుమాన్ గుడి సమీపంలో 40 ఏళ్ల మహేశ్ బాబు కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటాడు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 4:46 AM GMT
చెవిలో ఫోన్.. చంకలో వాటర్ హీటర్.. ఖమ్మంలో విషాదం!
X

ఒక చేత్తో ఫోన్.. మరోచేత్తో ఇంకో పని. కుదిరితే మరో పనిని సైతం చేసే వాళ్లంతా.. తమకున్న మల్టీ టాస్కింగ్ తీరుకు ముచ్చట పడిపోతుంటారు. జరిగినంత కాలం జరుగుుతంది కానీ.. తేడా కొడితే ప్రాణాలు పోయే పరిస్థితి. మనిషి జీవితంలో భాగమైన ఫోన్..కొన్నిసార్లు మనిషి జీవితాన్ని బలి తీసుకుంటున్న పరిస్థితి. సెల్ ఫోన్ తో సౌకర్యం ఎంతో.. అంతే అసౌకర్యం ఉంది. ఆ విషయాన్ని గుర్తించి.. పరిమితంగా వాడాల్సిన ఫోన్ ను ఇష్టారాజ్యంగా వాడితే జరిగే నష్టం ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పే విషాద ఉదంతం ఖమ్మంలో చోటు చేసుకుంది.

ఖమ్మం పట్టణంలోని కాల్వ ఒడ్డున ఉన్న హనుమాన్ గుడి సమీపంలో 40 ఏళ్ల మహేశ్ బాబు కొబ్బరికాయల వ్యాపారం చేస్తుంటాడు. ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల వేళలో పెంపుడు కుక్కకు స్నానం చేసేందుకు వేడినీళ్లు సిద్ధం చేస్తున్నాడు. ఇందుకోసం హీటర్ తో ఆన్ చేయబోయాడు.

అయితే.. ఇదే సమయంలో ఆయనకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ను అటెండ్ చేసిన మహేశ్.. ఒక చేత్తో సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని.. మరో చేత్తో వాటర్ హీటర్ ను పట్టుకున్నాడు. ఈ క్రమంలో చేతిలో ఉన్న హీటర్ ను నీళ్ల బకెట్ లో పెట్టాల్సింది పోయి.. పొరపాటున చంకలో పెట్టుకొని.. స్విచ్ వేశాడు. దీంతో.. తీవ్రమైన షాక్ కు గురైన ఆయన కింద పడిపోయాడు.

అతడికి దగ్గర్లో ఉన్న తొమ్మిదేళ్ల కుమార్తె భయంతో కేకలు వేస్తూ లోపలకు పరిగెత్తింది. దీంతో అప్రమత్తమైన మహేశ్ భార్య దుర్గ కరెంట్ స్విచ్ ఆపేసి.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. మహేశ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. చేతిలో ఉన్న సెల్ ఫోన్ విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.