Begin typing your search above and press return to search.

ఏపీలో ఎవరు గెలిచినా.. అవతలివారికి జైలే.. కేసులే?

అత్యంత హోరాహోరీగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి.

By:  Tupaki Desk   |   14 May 2024 12:30 PM GMT
ఏపీలో ఎవరు గెలిచినా.. అవతలివారికి జైలే.. కేసులే?
X

అత్యంత హోరాహోరీగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఒకరు వై నాట్ 175 అంటే.. మరొకరు తమ కూటమిదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకరు విధ్వంస పాలన అంటే మరొకరు విష కూటమి అని నిందించారు. ఇక వీరిలో ప్రజల తీర్పు ఎవరి పక్షాన ఉన్నదో జూన్ 4న తేలనుంది. ఓటరు తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఫలితాన్ని కాలానికి వదిలేసి అందరం ఓపికగా నిరీక్షించడమే చేయాల్సింది.

మళ్లీ జైలుకు పంపుతారా?

ఒకవేళ ఏపీలో మళ్లీ వైసీపీనే గెలిచిందని అనుకుందాం.. ఏం జరగబోతుంది..? కొత్తగా చెప్పాల్సినది ఏమీ లేదు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం 50 రోజులు జైల్లో ఉంచింది. చంద్రబాబుపై 22, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పై 23.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై 24 కేసులు పెట్టింది జగన్ సర్కారు. చంద్రబాబుపై ఏపీ సీఐడీ పెట్టినవే ఎనిమిది కేసులు ఉన్నాయి. అంగళ్లులో చంద్రబాబుపై దాడి చేయటమే కాకుండా తిరిగి ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. అనంతపురం, గుంటూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, నంద్యాల జిల్లాల్లోని వివిధ స్టేషన్లలో బాబుపై కేసులు నమోదవడం గమనార్హం. కొవిడ్‌ సెకండ్ వేవ్ లో 440కే వేరియంట్‌ గురించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని కూడా చంద్రబాబుపై కేసు పెట్టడం గమనార్హం. వ్యాక్సిన్లు అందుబాటులో లేవని వ్యాఖ్యానించినందుకూ విజయవాడ సూర్యారావుపేట ఠాణాలో కేసు నమోదు చేశారు. ఉచిత ఇసుక పాలసీపై సీఎంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు గండిపడిందని, ప్రివిలేజ్‌ ఫీజు, డిస్టలరీలు, వివిధ మద్యం బ్రాండ్లకు అనుమతులిస్తూ తీసుకున్న నిర్ణయంలో లోపాలున్నాయని.. సీఆర్‌డీఏ, రాజధాని, ఇన్నర్‌ రింగురోడ్డు మాస్టర్‌ ప్లాన్‌ నిర్ణయాల్లో కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చారని కేసులు పెట్టారు. వాటితో పాటు నైపుణ్యాభివృద్ధి, ఏపీ ఫైబర్‌నెట్‌, ఎసైన్డ్‌ భూములు, అధికార దుర్వినియోగంవంటి అంశాలపై సీఐడీ కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులోనే అరెస్టు చేశారు. జగన్ గనుక మళ్లీ గెలిస్తే.. చంద్రబాబును ఇంకా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం ఖాయమనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

మరి బాబు గెలిస్తేనో..?

ఏపీలో టీడీపీ కూటమి గనుక విజయం సాధిస్తే అది వైఎస్ జగన్ పట్ల ఎలా వ్యవహరిస్తుందనేది చాలా కీలకంగా మారింది. జగన్ ప్రభుత్వ కక్షసాధింపు పట్ల ఇప్పటికే టీడీపీ శ్రేణులు కసికసిగా ఉన్నాయి. జగన్ హయాంలోని మంత్రులు చంద్రబాబును వ్యక్తిగతంగా అత్యంత పరుష పదజాలంతో దూషించారు. వీరిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటివారున్నారు. వంశీ అయితే, మరీ దారుణమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇక జగన్ సర్కారు విధాన నిర్ణయాల్లో తప్పిదాలను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వెలికి తీసే వీలుంది. మరీ ముఖ్యంగా ఇసుక, మద్యం విధానంలో లోపాలను వెదికే చాన్సుంది. మరోవైపు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ఇప్పటికే టీడీపీ స్పష్టం చేసింది. విశాఖపట్నంలో వైసీపీ నేతలు అనేక ఆక్రమణలు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. రాజధానిగా ప్రకటించాక అనేక దందాలు చేశారని ధ్వజమెత్తుతోంది. ఇంకా చెప్పుకొంటూ పోతే చాలా ఆరోపణలు చేసింది. వీటిలో ఏదో ఒక తీవ్రమైన దానిపై జగన్ ను నేరుగా ఇరికించే చాన్సుందనేది విశ్లేషకుల మాట. ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులున్న జగన్ కు ఇకమీదట రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కేసులు కూడా నమోదు కానున్నాయి.

కొసమెరుపు: 1996-2004 మధ్యన ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్న చంద్రబాబుపై అప్పటి ప్రతిపక్ష, కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం వస్తే చంద్రబాబును జైల్లో వేస్తాం అనేంతగా ఉండేవి ఆ ఆరోపణలు. కానీ, వైఎస్ మొదటి టర్మ్ లో అత్యంత బలంగా ఉన్నప్పటికీ చంద్రబాబును ఏమీ చేయలేదు. బహుశా ఒక్క కేసు కూడా నమోదు చేసినట్లు లేదు. కానీ, వైఎస్ కుమారుడు జగన్ మాత్రం 20పైగా కేసులు పెట్టారు. జైలుకూ పంపారు.