Begin typing your search above and press return to search.

ఏపీలో ఇండియా కూటమి... చేరే పార్టీలు ....!?

ఏపీలో కూడా ఇండియా కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని ప్రచారం సాగుతోంది

By:  Tupaki Desk   |   8 Jan 2024 3:41 PM GMT
ఏపీలో ఇండియా కూటమి... చేరే పార్టీలు ....!?
X

ఏపీలో కూడా ఇండియా కూటమి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని ప్రచారం సాగుతోంది. అసలు ఏపీలో ఎన్డీయే కూటమి ఉందా అన్నది ముందుగా వచ్చే ప్రశ్న. దానికి జవాబు కొంత కాలం దాకా ఉంది. జనసేన బీజేపీ ఎన్డీయే కూటమిగా ఉన్నాయి. ఎన్డీయే కూటమి తరఫున జనసేనకు కొద్ది నెలల క్రితం ఆహ్వానం వచ్చింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు, మోడీతో పాటు సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన గోదావరి జిల్లాలలో జరిగిన వారాహి యాత్రంలో మాట్లాడుతూ ఏపీలో అధికారంలోకి వచ్చేది ఎన్డీయే కూటమి అని చెప్పారు.

ఇక సీన్ కట్ చేస్తే చంద్రబాబు అరెస్ట్ తరువాత పవన్ పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు టీడీపీతో జనసేన పొత్తు అన్నారు. ఇపుడు అందులో బీజేపీ చేరితే ఎన్డీయే కూటమి ఏపీలో బలంగా ఉన్నట్లు. లేకపోతే ఒక్క బీజేపీ మాత్రమే ఉంటుంది ఒంటరి పోరుకు సిద్ధపడాల్సి ఉంటుంది. బీజేపీ పొత్తుల మీద ఏదో ఒకటి తేల్చిన తరువాత ఈ విషయం కన్ ఫర్మ్ అవుతుంది.

ఇపుడు ఇండియా కూటమి గురించి ఆలోచిస్తే ఏపీలో కాంగ్రెస్ మళ్లీ తన బలం పుంజుకోవడానికి చూస్తోంది. అయితే కాంగ్రెస్ తో కలిసే మిత్రులు ఎవరు అన్నది కీలకమైన ప్రశ్న. కాంగ్రెస్ కి ఈ రోజుకు కలిసే పార్టీలు అయితే లేవు అనే అంటున్నారు. ఇండియా కూటమితో జాతీయ స్థాయిలో పనిచేస్తున్న కమ్యూనిస్టులు ఏపీలో మాత్రం టీడీపీ వైపు చూస్తున్నారు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోకపోతే చాలా కంఫర్టబుల్ గా కమ్యూనిస్టులు టీడీపీతో కలుస్తాయి.

ఇక ఏపీలో కాంగ్రెస్ ఉనికి ఎంతో బలం ఎంతో కూడా ఇంకా తేలాల్సి ఉంది. షర్మిల ఆ పార్టీకి సారధ్యం వహించినా కాంగ్రెస్ రానున్న కొద్ది నెలలలో ఏమీ పెరిగిపోదు, దాంతో కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ కంటే టీడీపీకే ప్రాధాన్యత ఇస్తారు అని అంటున్నారు. ఎందుకంటే రెండు ఎన్నికల నుంచి ఏపీ అసెంబ్లీలో కమ్యూనిస్టులు అడుగుపెట్టలేదు.

దంతో ఈసారి అయినా తమ ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కీలక ప్రకటన చేశారు. ఏపీలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని కలిపి ఇండియా కూటమి తరహాలో కూటమిని ఏర్పాటు చేస్తామని ఆయన చెబుతున్నారు.

అదే టైం లో ఆయన మరో విమర్శ కూడా చేశారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతోనే ఉన్నాయని ఆరోపించారు. షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్ లో ఉత్సాహం నెలకొందని అన్నారు. రాజమండ్రిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక సమాలోచన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ తో ఇప్పటికిపుడు జత కట్టే పార్టీలు ఏవీ అంటే లేవు అనే జవాబు వస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని భావించడంలేదు. మొత్తం మీద ఏపీలో ఇండియా కూటమి కానీ ఎన్డీయే కూటమి కానీ ఏర్పడుతాయని పెద్దగా ఎవరూ అనుకోవడంలేదు.