పవన్ గౌరవం....టీడీపీ తులాబారం.. వైసీపీ ఆరాటం!
అయితే సీట్లు కాదు ముందు జగన్ టార్గెట్ అన్నట్లుగా పవన్ వచ్చి పొత్తుల మీద ప్రకటించేశారు. సీట్ల సంగతి తరువాత అని మీడియాకూ చెప్పారు.
By: Tupaki Desk | 16 Sep 2023 11:30 PM GMTఆపద కాలంలో మిత్రుడు అంటారు. అలా పవన్ వచ్చి అన్ కండిషనల్ గా టీడీపీతో పొత్తు ప్రకటన చేశారు. నిజానికి వారాహి యాత్ర తరువాత జనసేన గ్రాఫ్ గోదావరి జిల్లాలలో పెరిగింది. అలాగే ఉత్తరాంధ్రాలో కూడా కొంత అదనపు బలం దక్కింది. ఈ పరిణామాల నేపధ్యంలో సీట్ల దగ్గర జనసేన గట్టిగా డిమాండ్ చేస్తుంది అని అంతా అనుకున్నారు.
వైసీపీ కూడా అదే ఊహించింది. పొత్తుల పితలాటకం తప్పదని కూడా లెక్కలేసింది. అయితే సీట్లు కాదు ముందు జగన్ టార్గెట్ అన్నట్లుగా పవన్ వచ్చి పొత్తుల మీద ప్రకటించేశారు. సీట్ల సంగతి తరువాత అని మీడియాకూ చెప్పారు. సో పవన్ తానుగా వచ్చి పొత్తుకు రెడీ అయిన వేళ సహజంగానే టీడీపీ మీద భారీ వత్తిడి తగ్గుతుంది.
అదే టైంలో జనసేనలో కొంత నైరాశ్యం ఉంది. దానికి పవన్ మ్యానేజ్ చేసి తన వారిని పొత్తు పార్టీ వైపు నడిపించాలంటే కచ్చితంగా జనసేనకు టీడీపీ గౌరవం ఇవ్వాలి. ఇప్పటిదాకా పవన్ చెబుతూ వస్తున్నట్లుగా గౌరవప్రదమైన సీట్లు ఆఫర్ చేయాలి. అంటే అవి మూడవ వంతుగా ఉండాలని అంటున్నారు
గత ఎన్నికల్లో జనసేన వల్ల 40 సీట్లలో టీడీపీకి దెబ్బ పడింది. ఇపుడు గ్రాఫ్ కూడా పెరిగింది కాబట్టి మరో పది సీట్లు కలుపుకుని యాభై దాకా ఇస్తేనే జనసైనికులు సైతం జై టీడీపీ అనగలరు అలా కాకుండా పవన్ ముందే పొత్తు ప్రకటించారు ఇక వెనక్కి పోలేరు అని అనుకుంటే మాత్రం లెక్కలలో తేడాలు వచ్చేస్తాయని అంటున్నారు
పవన్ వరకూ బాబు పట్ల పూర్తి స్నేహభావంతో ఉన్నా పొత్తు కుదిరినా రెండు పార్టీలకు న్యాయం అయితే జరగదు అని అంటున్నారు. అందుకే పొత్తు విజయవంతం కావాలీ అంటే మాత్రం చంద్రబాబు కూడా ఈ కీలక సమయంలో పెద్ద మనసు చేసుకోవాలీ అని అంటున్నారు.
మరి అలా జరుగుతుందా. టీడీపీ యాభై సీట్లను జనసేనకు ఇస్తుందా చంద్రబాబు ఆలోచనలు అలా మారతాయా అంటే దానికి చాలా చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు. యాభై సీట్లు జనసేనకు అంటే అక్కడికి అవకాశాలు టీడీపీలో చాలా మంది కోల్పోవాల్సి ఉంటుంది. ఇక జనసేనకు గట్టి అభ్యర్ధులు అన్ని చోట్లా ఉన్నారా అన్నది మరో చర్చ.
ఒకవేళ అలా కాకపోతే ఆ సీట్లు కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్లి మళ్ళీ ఆ పార్టీయే గెలిచే అవకాశం ఉంటుంది. అంటే గౌరవప్రదం అన్నది ఇపుడు ఎంతటి క్లిష్టమైన సమస్య అన్నది అర్ధమవుతోందా రాజా అంటున్నారు. టీడీపీ జనసేనల మధ్యన పొత్తు కుదిరినా అది ఫలించే అవకాశాలు చాలా తక్కువ అని వైసీపీ సరిగ్గా ఈ పాయింట్స్ దగ్గరే ఆలోచిస్తోంది.
చంద్రబాబు ఈసారి గెలవాలని అనుకుంటోంది తన కోసం కాదు, కుమారుడు లోకేష్ కోసం.ఆయన్ని భావి వారసుడిగా తీర్చిదిద్దడం కోసం. అది జరగాలీ అంటే టీడీపీ తానే సింగిల్ గా 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా గెలుచుకోవాలి. అలా గెలుచుకోవాలీ అంటే 150 కి తక్కువ లేకుండా పోటీ చేయాలి. అలా మిగిలిన పాతిక సీట్లే ఏ పార్టీకైనా పొత్తులో భాగంగా దక్కుతాయని అంటున్నారు. పవన్ ముందే పొత్తు ప్రకటన చేయడం వల్ల సీట్ల బేరం ఆడలేని పరిస్థితి ఉంటుందా అన్నది మరో ప్రశ్న. ఏది ఏమైనా పవన్ ఎంత తగ్గితే అంత టీడీపీకి మేలు అని ఆ పార్టీ చూస్తోంది.
ఎంత పెరిగితే అంత మేలు అని వైసీపీ ఆలోచిస్తోంది. తమ నేతకు ఎంత గౌరవం ఇస్తే అంతలా తాము చిత్తశుద్ధితో పనిచేస్తామని జన సైనికులు అంటున్నారు. ఇవన్నీ బ్యాలెన్స్ కుదరాలీ అంటే అపర చాణక్యుడు చంద్రబాబే చిక్కుముడులు చాలా విప్పాల్సి ఉంటుంది.