Begin typing your search above and press return to search.

ఏపీలో అత్యంత కీలక వ్యవస్థ రద్దు..? కొత్త సర్కారులో పెద్ద సంచలనమే..

దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఫలితాలు అంతే ఆసక్తికరంగా వచ్చాయి

By:  Tupaki Desk   |   15 Jun 2024 2:30 PM GMT
ఏపీలో అత్యంత కీలక వ్యవస్థ రద్దు..? కొత్త సర్కారులో పెద్ద సంచలనమే..
X

దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఫలితాలు అంతే ఆసక్తికరంగా వచ్చాయి. దుర్బేధ్యంగా కనిపించిన వైసీపీ అత్యంత బలహీన స్థితికి పడిపోగా.. కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీల పోరాటం ఫలించింది. దీంతో అఖండ మెజారిటీతో వారి ప్రభుత్వం ఏర్పాటైంది.

అసెంబ్లీలో బెంగ లేదు

ఏపీలో అసెంబ్లీ సభ్యుల సంఖ్య 175. ఇందులో ఇటీవలి ఎన్నికల్లో కూటమి 164 సీట్లను గెలుచుకుంది. వైసీపీ 11 సీట్లకు పరిమితం అయింది. దీంతో శాసనసభలో పూర్తి మెజారిటీ కూటమిదే. బిల్లుల విషయంలో గానీ, చర్చల సమయంలో గానీ.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

శాసన మండలిలోనే..

ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఏపీలో.. శాసన మండలి రద్దయింది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీనిని పునరుద్ధరించారు. అలా బహుశా 2007 నుంచి మనుగడలోకి వచ్చింది. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఏపీ, తెలంగాణలో ఇప్పటికీ శాసన మండలి కొనసాగుతోంది.

అక్కడా ఇక్కడా అదే పరిస్థితి..

నవంబరు చివరిలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, శాసన మండలిలో ఆ పార్టీకి ఒక్కరంటే ఒకరే సభ్యుడు ఉన్నారు. ఆయనే మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇక ఏపీలో2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించిన వైసీపీకీ తొలినాళ్లలో మండలిలో తగినంత ప్రాతినిధ్యం లేదు. దీంతో ప్రభుత్వం రూపొందించిన పలు బిల్లులు మండలిలో తిరస్కరణకు గురయ్యాయి. కొన్ని నిర్ణయాల విషయంలో జగన్ ప్రభుత్వం వెనక్కితగ్గింది ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు శాసన సభ, శాసన మండలిలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అధికార పార్టీ సంఖ్యా బలంతో అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినా, మండలిలో మోకాలడ్డే పరిస్థితి రావొచ్చు. జగన్ ప్రభుత్వం తెచ్చిన ఏపీ రాజధాని వికేంద్రీకరణ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వంటి బిల్లులు మండలిలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఒకానొక దశలో మండలిని రద్దు చేసే ఆలోచన వరకు వెళ్లింది. శాసన మండలి రద్దు కోరుతూ అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదింపజేసింది కూడా. కానీ, ఆ తర్వాత వెనక్కి తగ్గింది.

ఏపీలో రద్దు ఆలోచన దిశగా..

ఏపీ మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వీరిలో వైసీపీ వారే 38. టీడీపీకి 8 మందే ఉన్నారు. దీంతో కీలక బిల్లుల విషయంలో ఇబ్బందులు ఖాయం. ఈ నేపథ్యంలోనే ఏపీలో శాసన మండలి రద్దకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కొత్త ప్రభుత్వంలో తొలి భారీ నిర్ణయం ఇదే కానుంది. మరోవైపు ఎన్టీఆర్ మార్గంలోనే చంద్రబాబు శాసన మండలిని రద్దు చేసినట్లు అవుతుంది.

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే..

రాజకీయ అనివార్యతలు పెరిగిన పరిస్థితుల్లో అన్ని వర్గాల వారిని సమాధానపరిచాల్సి వస్తోంది. లేదంటే వెంటనే ప్రత్యర్థి ఎదురుదాడి తప్పదు. దానిప్రకారం చూస్తే చంద్రబాబు శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకుంటారా? అనేది సందేహమే. కానీ, పరిస్థితుల ప్రకారం చూస్తే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని చెప్పాలి.

ఎమ్మెల్సీలపైనే జగన్ ఆశలు

శాసన సభలో బలం 151 నుంచి 11కు పడిపోయిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ శాసన మండలిపై ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొచ్చని ఇటీవల పార్టీ ఎమ్మెల్సీల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కఠిన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదు.