మద్యంపై మతలబు.. బాబుకు చిక్కులు ...!
అక్టోబరు 1వ తేదీన రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ప్రకటించాలని కూటమి సర్కారు నిర్ణయించింది
By: Tupaki Desk | 12 Aug 2024 5:30 PM GMTఅక్టోబరు 1వ తేదీన రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ప్రకటించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. ఇప్పుడున్న విధానంలో లోపాలు ఉన్నాయని, ప్రభుత్వం కాకుండా ప్రైవేటుకు మద్యం నిర్వహణ బాధ్యతలు ఇచ్చేయాలని సీఎం చంద్రబాబు తలపోస్తున్నారు. అంటే ఒక రకంగా 2014 - 19 మధ్య అమలైన పాత మద్యం విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నారు. దీనిపై కూటమి సర్కారులోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న పాలసీని కొనసాగించాలని మెజారిటీ మంత్రులు చెబుతున్నట్టు తెలిసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం దండిగా వస్తుందని.. అవసరమైనప్పుడు ధరలు సమీక్షించుకునే అవకాశం ఉంటుందన్నది వారి వాదన. గతంలో 2014-19 మధ్య ఏటా.. 7,250 కోట్ల రూపాయల ఆదాయం సర్కారుకు సమకూరింది. కానీ, జగన్ తీసుకువచ్చిన మద్యం విధానంతో 25000 కోట్ల రూపాయలపైనే ఆదాయం సమకూరింది. దీంతో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు డబ్బులు సమకూరాయి.
ముఖ్యంగా అమ్మ ఒడి వంటి పెద్ద కార్యక్రమాలను అమలు చేసేందుకు వీలైంది. ఇప్పుడు దీనిని తగ్గించుకుంటే.. తల్లికి వందనం వంటి కార్యక్రమాన్ని(వైసీపీ కంటే ఎక్కువ మందికి ఇస్తామని చెప్పారు) అమలు చేసేందుకు మరింత ఇబ్బందులు వచ్చే చాన్స్ ఉందని నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాత విధానం కొనసాగించి.. కొత్తగా తీసుకువచ్చిన మద్యం బ్రాండ్లను ఎత్తేయడం ద్వారా.. ప్రజలను ఆకర్షించుకోవాలన్నది ఒక విధానం.
మరొకటి ఇప్పుడున్న వైన్స్ షాపుల సంఖ్యను మరో 1000 వరకు పెంచడం ద్వారా.. గ్యాప్‌ను తగ్గించి.. ధరలు తగ్గించినా ఆదాయానికి ఇబ్బంది లేని విధంగా చూసుకోవచ్చన్నది మరో విధానం. దీంతో నూతన మద్యం విధానంపై కూటమి సర్కారు తర్జన భర్జన పడుతుండడం గమనార్హం. మొదట్లో కొత్త విదానం తీసుకువచ్చి.. ప్రైవేటుకు అప్పగించాలని అనుకున్నా.. తాజాగా నాయకులు చెబుతున్న ఆలోచనతో చంద్రబాబు కూడా ఆలోచనలో పడ్డారు. అయితే.. జగన్ పేరు జనాలు మరిచిపోరు కదా! అనే వాదన కూడా ఉంది. దీంతో ఏదిశగా అడుగులు వేస్తారనేది చూడాలి.