ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్!
ఇందులో భాగంగా... ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు రంగం నుంచి స్వాధీనం చేసుకుని ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కు అప్పగించింది.
By: Tupaki Desk | 10 Jun 2024 11:02 AM GMTవైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ 2019లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే.. దశలవారీగా మద్యం నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు రంగం నుంచి స్వాధీనం చేసుకుని ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కు అప్పగించింది.
ఇదే సమయంలో... ఏపీలో బ్రాండెడ్ మద్యం కనిపించకుండా పోయిన పరిస్థితి. కనీవినీ ఎరుగని బ్రాండ్లు ఏపీ వైన్ షాపుల్లో హల్ చల్ చేసేవి. నిన్న దొరికిన బ్రాండ్ ఈరోజు దొరకదు.. ఈ రోజు దొరికింది రేపు దొరకదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇదే క్రమంలో... కూలింగ్ లేని బీర్లతో బీరుబాబుల కళ్లు ఎరుపెక్కిపోయేవి.
ఇలా ఊరూ పేరూ లేని రకరకాల బ్రాండ్లు రావడంతో వాటిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి. ఈ రోజు జగన్ ఈ స్థాయిలో ఘోర ఓటమి పాలవ్వడానికి మద్యం పాలసీ కూడా బలమైన కారణం అని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా డిజిటల్ చెల్లింపులకు అవకాశం, అనుమతి లేకపోవడం మరింత దారుణంగా మారిపోయింది.
అవును... ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లు, యూపీఐ ప్లాట్ ఫారమ్ ల ద్వారా ఎటువంటి చెల్లింపులు ఆమోదించబడకుండా.. కేవలం నగదు లావాదేవీలు మాత్రమే అనుమతించబడే ఆప్షన్ ఉండేది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి.. మందుబాబులు కారాలూ మిరియాలూ నూరేసేవారు.
ఈ సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏపీలో నాణ్యమైన మద్యం తక్కువధరకే అందించేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఇప్పటికే బ్రాండెడ్ లిక్కర్, బ్రాండెడ్ బీర్లు ఏపీలోకి ఎంటరైపోయాయని అంటున్నారు. ఇదే సమయంలో డిజిటల్ చెల్లింపులు కూడా స్టార్ట్ అయిపోయాయి!
ఇందులో భాగంగా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యూపీఐ ప్లాట్ ఫారమ్ ల ద్వారా డిజిటల్ చెల్లింపులు మాత్రమే మద్యం షాపుల్లో ఆమోదించబడేలా చర్యలకు ఉపక్రమించారని తెలుస్తుంది. త్వరలో పూర్తిగా డిజిటల్ చెల్లింపులే ఉండే అవకాశం ఉందని.. ఇక వైన్ షాపుల ముందు "నో క్యాష్" అనే బోర్డులు కనిపించబోతున్నాయని అంటున్నారు.