Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క అడ్డంకి: లోకల్ బాడీస్ టోటల్ గా కూటమి సొంతం ?

ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మునిసిపాలిటీలు కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల్లో నూటికి తొంబై శాతం పైగా వైసీపీ అన్నింటికీ కైవశం చెసుకుంది.

By:  Tupaki Desk   |   26 July 2024 3:15 AM GMT
ఒకే ఒక్క అడ్డంకి: లోకల్ బాడీస్ టోటల్ గా కూటమి సొంతం ?
X

ఏపీలో లోకల్ బాడీస్ ఎన్నికలు వైసీపీ ఏలుబడిలో జరిగినది ఒక చరిత్ర. ఎందుకు చెప్పాలంటే అప్పట్లో కరోనా విపరీతంగా ఉండడంతో ఆనాడు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. దాని మీద ఎంత రాజకీయ రచ్చ సాగిందో అంతా చూశారు. ఆ తరువాత 2021 మార్చిలో లోకల్ బాడీస్ కి ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మునిసిపాలిటీలు కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల్లో నూటికి తొంబై శాతం పైగా వైసీపీ అన్నింటికీ కైవశం చెసుకుంది.

మునిసిపాలిటీలు చూస్తే కనుక చూస్తే తాడిపత్రి తప్ప అన్నింటినీ వైసీపీ గెలుచుకుంది. కార్పోరేషన్లు కూడా అలాగే వైసీపీ ఖాతాలో పడ్డాయి. జెడ్పీ చైర్మన్లూ వారే అయ్యారు. ఏపీలో టీడీపీ కూటమి 164 సీట్లతో అధికారం చేపట్టినా లోకల్ బాడీస్ లో పాలన మాత్రం వైసీపీ చేతిలో ఉంది. దాంతో వైసీపీని రాజకీయంగా గట్టి దెబ్బ తీయాలీ అంటే లోకల్ బాడీస్ లో మొత్తం ఆ పార్టీ జెండా లేకుండా చేయడమే మార్గం అని కూటమి పెద్దలు భావిస్తున్నారుట.

దాంతో పాటు కూటమి విజయానికి కృషి చేసిన వారికి పదవులు పెద్ద ఎత్తున కావాలంటే కూడా స్థానిక సంస్థలు చేతిలో ఉండాల్సిందే అని అంటున్నారు. అలాగే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలకు ఎన్నికలు భవిష్యత్తులో ఎపుడు జరిగినా లోకల్ బాడీస్ కూటమి చేతిలో ఉంటే ఆ పదవులు అన్నీ వారికే వెళ్తాయి.

మరో వైపు లోకల్ బాడీస్ లో వైసీపీని గద్ద దించితే క్ష్త్రే స్థాయిలో ఆ పార్టీ పవర్ లేకుండా పోతుందని పార్టీ పరంగా కూడా సంస్థాగతంగా దెబ్బ తింటుందని లెక్క వేస్తున్నారుట. ఈ విధంగా బహుముఖ వ్యూహంతోనే లోకల్ బాడీస్ ని టీడీపీ కూటమి టార్గెట్ చేసింది అని అంటున్నారు.

ఇప్పటికే చాలా కార్పోరేషన్లు మునిసిపాలిటీలలో జెడ్పీటీసీలలో పెద్ద ఎత్తున వైసీపీ ప్రజా ప్రతినిధులు కూటమిలో చేరుతున్నారు. వారి అండదండలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి పెద్దగా ఫిరాయింపులు అన్న శ్రమ లేకుండానే లోకల్ బాడీస్ సొంతం అవుతాయని కూటమి పెద్దలు భావిస్తున్నారు.

అయితే దానికి ఒకే ఒక్క అడ్డనికి ఉంది అని అంటున్నారు. వైసీపీ సర్కార్ స్థానిక సంస్థలలో మేయర్ జెడ్పీ చైర్మన్ మునిసిపల్ చైర్మన్ల మీద అవిశ్వాసం ప్రవేశపెట్టాలంటే గెలిచిన నాలుగేళ్ల తరువాతే అని స్థానిక సంస్థల చట్టంలో సవరణలు చేస్తూ ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. మరి ముందు చూపుతో దీనిని తెచ్చారో లేక లోకల్ గా తమ పార్టీలోని వారే కప్పదాట్లు వేయకుండా ఉండాలని భావించారో ఏమో తెలియదు కానీ ఈ ప్రత్యేక చట్టం బ్రహ్మాస్త్రంగా ఉంటుంది అనుకున్నారు.

అయితే కూటమి ప్రభుత్వం అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దాంతో ఈ ప్రత్యేక చట్టాన్ని తిరిగి సవరించి రెండున్నరేళ్ళకే అవిశ్వాసం పెట్టేలా మార్పులు చేయబోతోంది అని అంటున్నారు. దాని కోసం శాసనమండలిలో కూడా మెజారిటీ సంపాదించేందుకు చూస్తోంది అని అంటున్నారు. మరో రెండు నెలల తరువాత జరిగే వర్షాకాల శాసన సభ సమావేశాలలో దీనికి సంబంధించి బిల్లూ పెట్టి చట్ట సవరణ చేయడం ద్వారా మొత్తానికి మొత్తం లోకల్ బాడీస్ ని ఒక్క దెబ్బకు లాగేయాలని చూస్తోంది అని అంటున్నారు.

ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి మొదటి అడ్డంకి శాసనమండలి. అక్కడ వైసీపీకి ఈ రోజుకీ మెజారిటీ ఉంది. దాంతో అక్కడ అనుకూలం చేసుకుంటే ఈ ప్రత్యేక చట్ట సవరణ సులువుగా సాగిపోతుంది. అపుడు ఏపీలో టాప్ టూ బాటం మొత్తం కూటమి ఏలుబడిలోకి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఈ రాజకీయ తతంగం జరిపేందుకు ముహూర్తం ఎపుడు నిర్ణయిస్తారో.