ఇది సినిమా కాదు.. నిజంగా 'మేక జీవితమే'!
అలాగే ఇదే విషయంపైన ‘మేక జీవితం’అనే పుస్తకం కూడా తాజాగా అందుబాటులోకొచ్చింది.
By: Tupaki Desk | 15 July 2024 8:12 AM GMTఇటీవల మళయాల స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కథనాయకుడిగా వచ్చిన ‘ద గోట్ లైఫ్’ సినిమా అంతా చూసే ఉంటారు. గల్ఫ్ దేశాల్లో మంచి ఉపాధి దొరుకుతుందని అక్కడికి వెళ్లాక.. మోసపోతే ఎలాంటి కష్టాలు ఉంటాయో, జీవితం ఎలా ఎడారిపాలవుతుందో ఈ సినిమాలో చూపించారు. అలాగే ఇదే విషయంపైన ‘మేక జీవితం’అనే పుస్తకం కూడా తాజాగా అందుబాటులోకొచ్చింది.
ఇప్పుడు అచ్చం ‘ద గోట్ లైఫ్’ సినిమా మాదిరిగానే కువైట్ లోని ఎడారిలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ఒక తెలుగు వ్యక్తి విషాధ గాథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివ.. తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉండేవారు. కూలి పనులతో వచ్చే అరకొర ఆదాయం సరిపోకపోవడంతో అప్పు చేసి మరీ శివ కువైట్ కు వెళ్లాడు.
వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన ఏజెంట్ హైదర్ ద్వారా శివ నెల రోజుల క్రితం కువైట్ వెళ్లాడు. ఈ నేపథ్యంలో అతన్ని అక్కడి ఎడారిలో జన సంచారం లేని ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతుల్ని మేపే పనిని అప్పగించారు. యజమానులు ఎప్పుడో కానీ అక్కడికి రాకపోవడం, తగిన ఆహారం, నీరు అందించకపోవడం, బాధలు చెప్పుకుందామనుకున్నా కనుచూప మేరలో జనం లేకపోవడం వంటి సమస్యలతో శివ పూర్తిగా భయపడిపోయాడు. అతడి మానసిక స్థితి కూడా పూర్తిగా దెబ్బతింది.
అంతకంతకూ కష్టాలు పెరిగిపోతుండటంతో తన ఏజెంట్ హైదర్ కు ఫోన్ చేసి శివ తన బాధలన్నింటిని వివరించారు. అయితే ఏజెంట్ అక్కడ పనిచేయాల్సిందేనని.. మరో మార్గం లేదని చెప్పడంతో శివ ఆవేదనకు గురయ్యాడు. తన బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయ్యింది.
ఇక్కడ కువైట్ లోని ఎడారిలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని శివ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కువైట్ కు రాకముందు చెప్పిన పని వేరని.. కువైట్ వచ్చాక చేయిస్తున్న పని వేరని వాపోయాడు. ఇక్కడ అంతా ఎడారేనని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉందన్నాడు. కనీసం మాట్లాడటానికి మనిషన్నవాడు లేడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆరోగ్యం దెబ్బతిన్నా యజమానులు పట్టించుకోవడం లేదని.. తనను కాపాడాలని.. లేకుంటే తనకు ఆత్మహత్యే శరణమ్యని ఆ సెల్ఫీ వీడియోలో శివ వాపోయాడు. ఇక్కడే ఉంటే మరో రెండు రోజులకు మించి తాను బతకనని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏజెంట్ తనను మోసం చేయడంతో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని బాధితుడు శివ కన్నీటిపర్యంతమయ్యాడు. తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ బాధితుడికి భరోసా ఇచ్చారు. బాధితుడి కుటుంబ సభ్యుల్ని టీడీపీ ఎన్నారై విభాగం సంప్రదిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే శివను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.