గురువుల కన్నా గూగుల్ మిన్న వార్తలు వైరల్... వివరణ ఇచ్చిన మంత్రి!
గురుపూజోత్సవం నాడు ఏపీ మంత్రి చేసిన ఒక్క మాట ఇప్పుడు వివాదాస్పదమవుతుంది.
By: Tupaki Desk | 7 Sep 2023 5:26 AM GMTగురుపూజోత్సవం నాడు ఏపీ మంత్రి చేసిన ఒక్క మాట ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. అయితే చెప్పిన ఉద్దేశ్యం వేరు కన్ వే అయిన మేటర్ వేరనే సమర్ధింపు కామెంట్లు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటికే ఆ విషయంపై విపక్షాలు ఫుల్ కవరేజ్ ఇచ్చేయడంతో మేటర్ హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన గురుపూజోత్సవ సభలో పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన... గురువుల కన్నా గూగుల్ లో ఎక్కువ మెటీరియల్ లభిస్తోందంటూ కామెంట్ చేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
అవును... బైజూస్ తో టెక్నాలజీ మొత్తం ట్యాబుల్లో నిక్షిప్తమై అందుబాటులో ఉందని.. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చిందని.. ఉపాధ్యాయులకు తెలియని అంశాలు కూడా గూగుల్ కొడితే వెంటనే తెలిసిపోతుందని మంత్రి వ్యాఖ్యానించారని తెలుస్తుంది! దీంతో ఉన్నత విద్యావంతుడు, మాజీ సివిల్ సర్వెంట్ అయిన సురేష్ ఇలా వ్యాఖ్యానించడం ఏమిటని పలువురు ఆశ్చర్యపోతున్నారు.
ఈ సమయంలో ఈయన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా మంత్రిపై విమర్శలు చేశారు. గూగుల్ మిన్న, గురువులు సున్నా.. ఇదేం సన్మానం మంత్రి గారు అంటూ ప్రశ్నించారు. గురుపూజోత్సవం నాడు గురువును పూచిక పుల్లతో సమానంగా తీసిపడేశారని మండిపడ్డారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ వివరణ:
ఈ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో మంత్రి స్పందించారు. గురువులు కన్నా గూగుల్ మేలని తాను అనలేదని, తాను అలా అన్నట్టు వచ్చిన వార్తలను ఖండిస్తున్నానని అన్నారు. ఒంగోలులో ఉపాధ్యాయ దినోత్సవ సభలో తాను మాట్లాడింది ఒకటైతే.. మీడియా దానిని వక్రీకరించిందని తెలిపారు.
ఇదే సమయంలో తన మాటలను వక్రీకరించడం ద్వారా.. ఉపాధ్యాయ లోకానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని.. ఫలితంగా తనపై వ్యక్తిగత దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఉపాధ్యాయుడిగా ఉండటాన్ని గర్వపడతానని అదే సభలో మాట్లాడింది వినిపించలేదా.. అని ఈ సందర్భంగా మంత్రి ప్రశ్నించారు.
అనంతరం... మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ఇదే సమయంలో ఇంటర్నెట్ సౌలభ్యంతో సమాచారం అంతా దొరుకుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులే అనే ఉద్దేశంలో తాను మాట్లాడానని.. దాన్ని వక్రీకరించారని మంత్రి వివరణ ఇచ్చారు!