Begin typing your search above and press return to search.

బొత్స మేనల్లుడిని కెలుకుతున్న టీడీపీ

విజయనగరం జిల్లా అంటేనే బొత్స ఫ్యామిలీది. ఆయన ఏ పార్టీలో ఉన్న ఫ్యామిలీ ప్యాక్ ని చక్కగా అమలు చేసుకోగలుగుతారు.

By:  Tupaki Desk   |   1 Sep 2023 8:51 AM GMT
బొత్స మేనల్లుడిని కెలుకుతున్న టీడీపీ
X

విజయనగరం జిల్లా అంటేనే బొత్స ఫ్యామిలీది. ఆయన ఏ పార్టీలో ఉన్న ఫ్యామిలీ ప్యాక్ ని చక్కగా అమలు చేసుకోగలుగుతారు. తన బంధువులు, బలగం, సన్నిహితులు ఇలా అందరికీ సీట్లు తెచ్చుకుని జిల్లా రాజకీయాన్ని తన గుప్పిట పట్టడంలో బొత్సకు ఆయనే సరిసాటి.

బొత్సది మూడున్నర దశాబ్దాల నాటి రాజకీయ జీవితం. ఆయనకు ప్రతీ దశలోనూ అండగా ఉంటూ జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న వారు మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను. ఆయన బొత్స ఉన్నా లేకున్నా మొత్తం జిల్లా రాజకీయాలను చూసుకుంటారు. ఒంటిచేత్తో నడిపిస్తారు.

ఇది చాలా కాలంగా సాగుతూ వస్తున్న విషయం. బొత్స కాంగ్రెస్ లో ఉన్నా వైసీపీలో ఉన్నా జిల్లాలో మాత్రం పార్టీలో ఎవరేమి అడగాలన్నా ఏ అవసరం వచ్చినా మొదటి పిలుపు ఎవరిది అంటే చిన్న శ్రీను అనే. ఆయన అంతలా పార్టీ రాజకీయాల్లో మమేకం అయిపోయారు. ఇక చిన్న శ్రీను ప్రతిభను చూసి ఏకంగా జగన్ ఆశ్చర్యపోయారు.

విజయనగరం జిల్లాలో ఆయన పాదయాత్ర మొత్తం సక్సెస్ ఫుల్ గా సాగడం వెనక చిన్న శ్రీను ప్లానింగ్ ఉంది. దాంతో అప్పట్లోనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని జగన్ చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో చిన్న శ్రీను నిలబడలేదు. పార్టీ నేతల విజయానికి కృషి చేస్తాను అని అన్నారు. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయనగరం జెడ్పీ చైర్మన్ పోస్టుని చిన్న శ్రీనుకు జగనే కేటాయించారు

ఆ తరువాత వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను కూడా ఆయన అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న మొత్తం తొమ్మిది అసెంబ్లీ, ఒక ఎంపీ సీటుని మరోసారి గెలిచి క్లీన్ స్వీప్ చేయడానికి వైసీపీ పావులు కదుపుతోంది. దాని వెనక చిన్న శ్రీను కసరత్తు తీవ్రంగా చేస్తున్నారు.

ఇక టీడీపీ గతం కంటే జిల్లాలో పరిస్థితిని మెరుగుపరచుకున్నా మెజారిటీ సీట్లు ఈ రోజుకీ వైసీపీకి వచ్చేలా సీన్ ఉందని అంటున్నారు. దాంతో చిన్న శ్రీను మీద టీడీపీ గురి పెట్టింది అని అంటున్నారు. 2018 అక్టోబర్ నెలలో విజయనగరం జిల్లా పాదయాత్రలో జగన్ ఉన్నపుడు ఆయన విశాఖ ఎయిర్ పోర్టుకి వచ్చిన వేళ కోడి కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డారు.

అయితే ఈ కేసు అయిదేళ్లుగా సాగుతున్నా కూడా వెనక సూత్రధారులు ఎవరు అన్నది తేలలేదు. ఇక విశాఖలో ఈ కేసు ఎన్ఐఏ కోర్టులో విచారణలో ఉండగా కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను తరఫున న్యాయవాది ఒకరు దీని వెనక వైసీపీ నేతల హస్తం ఉందని పేర్కొన్నారు. అలా చిన్న శ్రీను మీద ఈ నిందను టీడీపీ వేసేసింది. దానిని తెలుగుదేశం అనుకూల మీడియా గట్టిగా రాస్తోంది

దీంతో చిన్న శ్రీను ఫైర్ అవుతున్నారు. ఆయన ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తనను ఈ కేసులో ఇరికించి అప్రతిష్టపాలు చేయాలని టీడీపీ దాని అనుకూల మీడియా చూస్తోందని విమర్శించారు. తాను ఏంటో జిల్లా ప్రజలకు బాగా తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు.

తన ఇమేజ్ ని దెబ్బ తీయాలని టీడీపీ నేతలు చూడడం దారుణం అన్నారు. తనని ఎంతలా విమర్శించినా ప్రజలు తమ వైపే ఉన్నారని ఆయన అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం చిన్న శ్రీనుని టీడీపీ టార్గెట్ చేసింది అని అంటున్నారు. ఇప్పటిదాకా బొత్స మీదనే టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చేది.

ఇపుడు చిన్న శ్రీనుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆయనను ఈ లెవెల్ లో కెలకడం అంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీ అని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో అత్యధిక సీట్లను గెలుచుకోవాలని టీడీపీ చూస్తోంది. దాని కోసం వైసీపీలో ఉన్న వారిని టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. బొత్స మేనల్లుడు వైసీపీలో జిల్లా రాజకీయాలలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. అందుకే ఆయననే సరిగ్గా గురి చూసి కెలుకుడు స్టార్ట్ చేసింది అని అంటున్నారు.

దీనికి చిన్న శ్రీను వివరణ ఇచ్చినా ఇది సరిపోతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. రానున్న రోజుల్లో బొత్స మేనల్లుడిని మరింతగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో విజయనగరం నుంచి లోక్ సభకు ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి ఇపుడు జిల్లాలో అసలైన యుద్ధం ఆరంభం అయింది అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంత దూరం పోతుందో.