పురందేశ్వరికి ఏపీ మంత్రి సవాల్... స్పందిస్తారా?
ఏపీలో చీప్ లిక్కర్ అమ్ముతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Sep 2023 9:20 AM GMTరాజకీయాల్లో విమర్శలు చేయడం, బురదజల్లే పనికి పూనుకోవడం.. అనంతరం సరైన కౌంటర్ పడేసరికి పలాయనం చిత్తగించడం కామన్ అయిపోయిందనే కామెంట్లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంటే... ఏపీ బీజేపీ బాధ్యతలు తీసుకున్నప్పటినుంచీ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పురందేశ్వరికి తాజాగా సవాల్ విసిరారు ఏపీ మంత్రి నారాయణ స్వామి.
అవును... ఏపీలో చీప్ లిక్కర్ అమ్ముతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిటైల్డ్ గా వివరించారు. తాను సీఎం అయినప్పటినుంచీ ఒక్క కొత్త మద్యం కంపెనీకి కూడా అనుమతులు ఇవ్వలేదని, ఇప్పుడున్న కొత్త కొత్త బ్రాండ్లు అన్నీ గత టీడీపీ ప్రభుత్వ పుణ్యమే అని ఫైరయ్యారు.
ఇదే సమయంలో విశాఖ వెళ్లిన పురందేశ్వరి... కేజీహెచ్ లో లివర్ సమస్యతో బాధపడుతున్న కొందరు రోగులను పరామర్శించారు. ఆ తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో చీప్ లిక్కర్ తాగి చాలా మంది మరణిస్తున్నారు అని వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయంపై తాజాగా విశాఖ వెళ్లిన ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణ స్వామి పురందేశ్వరి చేసిన కామెంట్స్ కి ధీటైన సవాల్ చేశారు.
ఇందులో భాగంగా ఏపీలో చీప్ లిక్కర్ తాగి ఎవరైనా చనిపోయారు అని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి తప్పుకుంటాను అని స్పష్టం చేశారు. పురందేశ్వరి వద్ద లిక్కర్ నాణ్యతకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావాలని కోరుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని హరించే మద్యాన్ని ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రభుత్వం ఉపేక్షించేదని అన్నారు. ప్రజలకు మెరుగైన విద్య, ఆరోగ్యం, సంక్షేమం అందించడమే నిజమైన అభివృద్ధి అని, అదే జగన్ సంకల్పమని స్పష్టం చేశారు.
ఆనందపురం మండలం గోరింటలో రూ.20 కోట్లతో నిర్మించనున్న ఎక్సైజ్ శాఖ కాంప్లెక్స్, ఏపీఎస్‌బీసీఎల్ డిపో నిర్మాణ పనులకు నారాయణస్వామి శంకుస్థాపన చేశారు. ఇదే సమయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఎనిమిది రకాల పరిక్షలతో మద్యం నాణ్యతను పరీక్షించవచ్చని తెలిపారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం 20 రకాల పరిక్షలు నిర్వహించి మరింత నాణ్యత ప్రమాణాలను అన్వేషిస్తోందని చెప్పారు.
ఏది ఏమైనా... ఏపీ బీజేపీ చీఫ్ హోదాలో పురందేశ్వరి చేసిన ఆరోపణలకు ఏపీ ఎక్సైజ్ శాఖా మంత్రి ఈ రేంజ్ లో సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై నిరూపించే పనికి పురందేశ్వరి పూనుకుంటారా.. లేక, సైడ్ అయిపోయి మరో విషయంపై విమర్శలు గుప్పిస్తారా అన్నది వేచి చూడాలి!