త్వరలోనే చంద్రబాబు, లోకేశ్ జైలుకు: రోజా సంచలన వ్యాఖ్యలు!
ఆంధప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ లపై తీవ్ర విమర్శలు చేసేవారిలో వైసీపీ నుంచి ఆర్కే రోజా ఒకరు.
By: Tupaki Desk | 7 Sep 2023 8:55 AM GMTఆంధప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ లపై తీవ్ర విమర్శలు చేసేవారిలో వైసీపీ నుంచి ఆర్కే రోజా ఒకరు. గత ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచిన రోజా ఆరంభం నుంచి చంద్రబాబుపై తీవ్రంగా మాటల దాడి చేస్తున్నారు.
ప్రస్తుతం వైఎస్ జగన్ మంత్రివర్గంలో పర్యాటక, క్రీడల శాఖ మంత్రిగా ఉన్న ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని తెలిపారు.
చంద్రబాబు జైలుకెళ్లితే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందన్నారు. రూ.118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కోనే దమ్ముందా లేదా..? అని చంద్రబాబును రోజా ప్రశ్నించారు. విచారణ ఎదుర్కొంటారా లేక బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా అని నిలదీశారు.
చంద్రబాబు కూడా విజయ్ మాల్యాలా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్ లను జైలులో పెడితేనే ప్రజలకు మేలు జరుగుతుందని రోజా తెలిపారు. చంద్రబాబు అడ్డంగా దొరికిపోయినప్పుడు సింపతి డ్రామాలు ఆడటం ఆయనకు అలవాటు అని ధ్వజమెత్తారు.
తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయి చంద్రబాబు రాష్ట్రానికి పారిపోయి వచ్చాడని రోజా గుర్తు చేశారు. చంద్రబాబు మీద అలిపిరిలో బాంబు పేలినప్పుడే ఆయనకు సానుభూతి రాలేదన్నారు. చంద్రబాబు అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది అని రోజా తెలిపారు.
గతంలో 2019లో ఎన్నికల ముందు కూడా మోదీ తనను అరెస్ట్ చేస్తారని సానుభూతి డ్రామా ఆడింది చంద్రబాబు కాదా? అని రోజా నిలదీశారు. చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాబుని ముడుపుల కేసులో సీబీఐ, ఈడీ విచారించాలి అని కోరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి.. చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని రోజా నిలదీశారు. అవినీతిని ప్రశ్నిస్తాననే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
’’చంద్రబాబు, లోకేశ్ తోడు దొంగలు. దోచుకున్నది హైదరాబాద్ లోని తమ ఇంట్లో దాచుకున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగలలాగా ఉన్నారు. ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టా అని చెప్పే పవన్ కల్యాణ్.. ఎందుకు ప్రశ్నించడం లేదు? బీజేపీ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎందుకు మాట్లాడటం లేదో అని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ అనుమానంగా ఉంది. పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలా? లేక బాబు జనతా పార్టీ అధ్యక్షురాలా? అని ప్రజలంతా డౌట్ పడుతున్నారు’’ అని ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవినీతి అమరావతిలో చంద్రబాబు దోచుకున్నది దాదాపుగా రూ.2 వేల కోట్లకు పైగానే ఉందని 2020లోనే తేలిందన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ జైలుకి వెళ్లే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని రోజా హెచ్చరించారు. చంద్రబాబుతో కలిసి దోచుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆల్రెడీ జైలుకెళ్లాడని గుర్తు చేశారు. ఇక, ఈ అమరావతిలో దోచుకున్న చంద్రబాబు కూడా తొందరలోనే కొడుకుతో సహా జైలుకెళ్లడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు.