Begin typing your search above and press return to search.

కొత్త మంత్రులకు పట్టు దొరకడం లేదా ?

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరి కోరి కొత్త వారికి చాన్స్ ఇచ్చారు. ఇది జగన్ మాదిరిగా సోషల్ ఇంజనీరింగ్ అనుకోవాలి

By:  Tupaki Desk   |   21 July 2024 7:30 AM GMT
కొత్త మంత్రులకు పట్టు దొరకడం లేదా ?
X

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరి కోరి కొత్త వారికి చాన్స్ ఇచ్చారు. ఇది జగన్ మాదిరిగా సోషల్ ఇంజనీరింగ్ అనుకోవాలి. అంతే కాదు యువతకు కొత్త ముఖాలకు జూనియర్లకు ఆయన కీలక శాఖలు ఇచ్చి ప్రాధాన్యత పెంచారు. అలా చూసుకుంటే ఉత్తరాంధ్రాలో ఒక్క శ్రీకాకుళం తప్ప మిగిలిన జిల్లాలలో అంతా తొలిసారి మంత్రులుగా ఉన్న వారే.

శ్రీకాకుళానికి అనుభవం కలిగిన అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. దాంతో జిల్లాలో పట్టు సులువుగా సాధిస్తున్నారు. లోపల ఏమి అనుకున్నా బయట అంతా ఒక్కటిగా తమ్ముళ్ళు ఉంటున్నారు. ఇక అధికార వ్యవస్థను కూడా సక్రమంగా నడపడంలోనూ అనుభవం ఉంది.

అదే విజయనగరం జిల్లాలో చూసుకుంటే రాజకీయాలకే పూర్తిగా కొత్త అయిన కొండపల్లి శ్రీనివాస్ కి జాక్ పాట్ తగిలినట్లుగా ఇలా ఎమ్మెల్యే కాగానే అలా మంత్రి పదవి దక్కింది. దాంతో జిల్లాను మొత్తం కో ఆర్డినేట్ చేసుకోవడం కొత్త మంత్రిగా ఆయనకు పెద్ద బాధ్యతానే ఉంది.

సీనియర్లు గా కిమిడి కళా వెంకటరావు ఉన్నారు. అలాగే బొబ్బిలి సోదరులు ఉన్నారు, ఎస్ కోట నుంచి గెలిచి మంత్రి పదవిని ఆశించిన కోళ్ళ లలిత కుమారి వాంటి వారు ఉన్నారు. అందరినీ కలుపుకుని పోవాల్సి ఉంది. అలాగే జిల్లాను అభివృద్ధి పధంలో నడిపించాలి.అధికారులను కూడా దారిలోకి తెచ్చుకుని పట్టు సాధించాల్సి ఉంది.

ఆయన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు మాటనే వింటున్నారని సీనియర్లు కొందరు గుస్సా అవుతున్నారు. అలాగే తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా అంటున్నారు. ఆయన పరిస్థితి ఇలా ఉంటే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వంగలపూడి అనితకు హోం శాఖను ఇచ్చారు. ఆమె మొత్తం జిల్లా బాధ్యతలను చూడాలి. సీనియర్లు అయిన మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ గంటా శ్రీనివాసరావు వంటి వారు ఎమ్మెల్యేలుగానే ఉన్నారు.

ఇక మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి స్పీకర్ ఇచ్చి మాట్లాడకుండా చేశారు. దాంతో జిల్లాను ప్రగతిపధంలో నడిపిస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత అనిత మీద ఉంది. ఆమె అందరు సీనియర్ల ఇంటికి వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అయితే రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి. ఎవరి అవకాశాలు వారు చూసుకుంటారు. దాంతో ఈ లేడీ హోం మినిస్టర్ డైనమిక్ ఉంటూ రాజకీయంగా స్పీడ్ పెంచాలని అపుడే జిల్లా మీద పట్టు చిక్కుతుందని అంటున్నారు.