Begin typing your search above and press return to search.

మొన్న నంద్యాల, నిన్న విజయనగరం, నేడు గుంటూరు... మైనర్ బాలికలే టార్గెట్!

అవును... గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన 8వ తరగతి విద్యార్థిని శైలజ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

By:  Tupaki Desk   |   16 July 2024 12:10 PM GMT
మొన్న నంద్యాల, నిన్న విజయనగరం, నేడు గుంటూరు... మైనర్  బాలికలే టార్గెట్!
X

ఏపీలో గత కొన్ని రోజులుగా దాదాపు వరుసగా అన్నట్లుగా వెలుగు చూస్తున్న మైనర్ బాలికలు, పసి కందులపై అత్యాచార ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృగాళ్లు... మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుండటం తీవ్ర ఆందోళనగా ఉంది. ఈ సమయంలో గుంటూరులో మరో మైనర్ బాలిక బలైంది!

అవును... గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన 8వ తరగతి విద్యార్థిని శైలజ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదే గ్రామంలోని గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో ఆ బాలిక విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించారు కుటుంబ సభ్యులు. ఆమె మెడపై గాయాలు కనబడటంతో హత్యకుగురై ఉండొచ్చని భావిస్తున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... శైలజ, ఆమె అన్నయ్య సోమవారం ఉదయం స్కూల్ కి వెళ్లారు. అయితే స్కూల్ అయిపోయాక ఆమె అన్నయ్య ఒక్కడే ఇంటికి తిరిగివచ్చాడు. దీంతో... చెల్లి ఏదని తల్లి ప్రశ్నించడంతో... ఆ బాలుడు తిరిగి స్కూల్ కి వచ్చి ఉపాధ్యాయులను అడిగాడు. అయితే... ఒంట్లో బాగాలేదని మీ చెల్లి మధ్యాహ్నమే వెళ్లిపోయినట్లు వారు చెప్పారు.

దీంతో... ఆ విషయం తన తల్లికి చెప్పిన ఆ బాలుడు, ఆమెతో కలిసి ఊళ్లో వెతికారు. ఈ క్రమంలో గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి వద్ద చెల్లెలి చెప్పులు గుర్తించాడు ఆ బాలిక అన్న. ఈ సమయంలో కిటికీ లో నుంచి చూసేస్రికి... మంచంపై ఆమె విగతజీవిగా కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు.

దీంతో... హుటాహుటిన నాగరాజు ఇంటికి వెళ్లిన శైలజ కుటుంబ సభ్యులు తాళం పగలగొట్టి, బాలికను బయటకు తీసుకొచ్చారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాలికను గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ కు తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

అయితే ఇప్పటికే పెళ్లినా.. మూడేళ్లుగా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్న నాగరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అంటున్నారు. బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో బాలికను ఒంటరిగా బయటకు పంపిన ఉపాధ్యాయులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక.. ఇప్పటికే జరిగిన రెండు దారుణాలపై హోంమంత్రి అనిత స్పందించారు. ఇందులో భాగంగా... నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై అత్యాచరం చేసి హత్య చేసిన ఘటనలో మృతదేహం ఆచూకీ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇక విజయనగరం జిల్లాలో అత్యాచారానికి గురైన చిన్నారి పేరుతో రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.