ఫించన్ల పంపిణీ కోసం అధికారుల డేంజర్ ఫీట్
ఏమైనా చేయండి. ఎలాంటి నిర్ణయాన్ని అయినా తీసుకోండి.
By: Tupaki Desk | 3 Aug 2024 8:53 AM GMTఏమైనా చేయండి. ఎలాంటి నిర్ణయాన్ని అయినా తీసుకోండి. ప్రతి నెలా మొదటి రోజున పంపిణీ చేసే పింఛన్ల మొత్తాన్ని లబ్థిదారులకు చేరేలా చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు అధికారులు. దీంతో.. మొదటి తారీఖునే 97-98 శాతం లబ్థిదారులకు పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు తీసుకుంటున్న రిస్కు చూస్తే ఒళ్లు జలదరించేలా మారింది.
అలాంటి ఉదంతమే ఒకటి అల్లూరి సీతారామారాజు జిల్లాలో చోటు చేసుకుంది. కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు సకాలంలో ఫించన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించేందుకు సిద్ధమయ్యారు. విడి రోజుల్లో అయితే.. ఫర్లేదు కానీ.. వర్షాలు ఎక్కువగా పడిన టైంలో మారుమూల ఉన్న గిరిజన తండాలకు చేరుకోవటం క్లిష్టమైన ప్రక్రియ.
అయినప్పటికీ..ఆగస్టు ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసేందుకు వీలుగా కొందరు అధికారులు ప్రయత్నాలు షురూ చేశారు. అయితే.. జోరుగా కురిసిన వర్షాలు వాగులు.. వంకలు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. అయినప్పటికీ సకాలంలో పింఛన్లు ఇవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు డేంజర్ ఫీట్ కు తెర తీశారు. డబ్బులు చేతిలో పట్టుకొని.. బట్టలు విప్పేసి మరీ ప్రమాదకర వాగులో ఈదుకుంటూ గిరిజన ప్రాంతాలకు వెళ్లారు. వారి సాహసాన్ని చూసిన ఉన్నతాధికారులు ప్రశంసించారు. అయితే.. ఇలాంటి ప్రమాదకర ఫీట్ల లో ఏ మాత్రం తేడా కొట్టినా పెద్ద ఎత్తున విమర్శలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఏమైనా.. ప్రభుత్వ కమిట్ మెంట్ కు తగ్గట్లే అధికారులు సైతం అదే రీతిలో స్పందిస్తున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. అనుకున్నట్లే.. 97 శాతం ఫించన్ల పంపిణీతో అధికారులు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.