Begin typing your search above and press return to search.

బాబాయ్‌ కి రామ్‌ చరణ్‌ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌!

ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైద్య సేవల రంగంలో దేశంలోనే ప్రముఖ ఆస్పత్రిగా ఉన్న అపోలో పిఠాపురంలో ఏర్పాటు కానుంది.

By:  Tupaki Desk   |   15 Aug 2024 6:36 AM GMT
బాబాయ్‌ కి రామ్‌ చరణ్‌ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌!
X

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నియోజకవర్గంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని తీసుకొస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రామ్‌ చరణ్‌ తో మాట్లాడి అపోలో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తానని.. ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందజేస్తానని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలో పిఠాపురం నుంచి 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో పవన్‌ కళ్యాణ్‌ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండటంతో తాను ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించారు.

ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైద్య సేవల రంగంలో దేశంలోనే ప్రముఖ ఆస్పత్రిగా ఉన్న అపోలో పిఠాపురంలో ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని రామ్‌ చరణ్‌ తెలిపినట్టు అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు వెల్లడించారు.

ఇప్పటికే తన బాబాయ్‌ హామీని నెరవేర్చేందుకు పిఠాపురం నియోజకవర్గంలో పది ఎకరాల స్థలాన్ని కూడా రామ్‌ చరణ్, ఆయన సతీమణి, అపోలో లైఫ్‌ సంస్థల చైర్‌ పర్సన్‌ ఉపాసన కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో అపోలో ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ప్రముఖ హాస్పిటల్‌ చైన్‌ గా కూడా అపోలో సంస్థలకు పేరుంది. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ పోటీ ద్వారా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పిఠాపురంలోనూ అపోలో ఆస్పత్రి ఏర్పాటు కానుంది.

ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ తరఫున ప్రచారం చేసిన ఆయన అన్న నాగబాబు కుమారుడు, ప్రముఖ నటుడు వరుణ్‌ తేజ్, పవన్‌ మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ సైతం పిఠాపురం తమ కుటుంబానికి ప్రత్యేక ప్రదేశంగా నిలుస్తుందని చెప్పారు. తమ హృదయంలో పిఠాపురానికి ప్రత్యేక స్థానం ఉంటుందని వెల్లడించారు.

ఇదే స్థాయిలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా కులమతాలకతీతంగా పవన్‌ కళ్యాణ్‌ కు ఘనవిజయం అందించారు. దీంతో ఇచ్చిన హామీలపై డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్‌ దృష్టి సారించారు. ఇందులో భాగంగా అతి త్వరలోనే పిఠాపురంలో అపోలో ఆస్పత్రి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన పనులు కూడా షురూ అయ్యాయి.

కేవలం అపోలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రే కాకుండా నియోజకవర్గానికి అవసరమైన ఇతర ప్రజోపయోగ పనులను చేపట్టడానికి సొంత నిధులను సైతం వెచ్చించడానికి మెగా కుటుంబం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వంలో పవన్‌ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఆయన ఆశించినట్టు దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారునుందని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.