Begin typing your search above and press return to search.

ఏపీలో 1.83 కోట్ల మంది ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలెందుకు?

ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు సగం వరకు తమ ఆధార్ ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   17 Aug 2024 6:30 AM GMT
ఏపీలో 1.83 కోట్ల మంది ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలెందుకు?
X

ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు సగం వరకు తమ ఆధార్ ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. ఇదే విషయాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. తాజా రూల్ ప్రకారం.. ఇప్పటికే ఆధార్ కార్డు ఉన్నప్పటికి.. ఏపీలో ఆధార్ ను అప్డేట్ చేసుకోవాల్సిన వారి సంఖ్య 1,83,74,720 మంది ఉన్నట్లుగా చెబుతున్నారు.

చిన్న వయసులో ఆధార్ కార్డు పొందిన వారు అప్పట్లో నమోదు చేసుకున్న వేలిముద్రలో మార్పులు చోటు చేసుకునే వీలు ఉండటంతో అలాంటి వారు తమకు18 ఏళ్ల వయసు దాటిన తర్వాత మరోసారి కొత్తగా వేలి ముద్రలు తీసుకోవటం తప్పనిసరి. ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాంటి వారు ఏపీలో 48.63 లక్షల మంది ఉన్నారు.

ఇక.. పదేళ్ల కాలంలో ఒక్కసారైనా ఆధార్ లో అంతకు ముందున్న అడ్రస్ తో పాటు ఫోటోలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేటగిరిలో ఆధార్ ను అప్డేట్ చేసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 1.35కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 20 నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. అప్పుడే సమస్య తీవ్రత అర్థమవుతుంది.

దేశ వ్యాప్తంగా ఆధార్ ను జారీ చేసే యూఐడీఏఐ సంస్థ సూచనతో ఏపీలో గడిచిన రెండేళ్లుగా ప్రత్యేక ఆధార్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నా.. ఇంకా అప్డేట్ చేసుకోవాల్సిన వారు కోట్లల్లో ఉండటం గమనార్హం. అందుకే.. ఆగస్టు 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ లో తమ ఆధార్ ను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో.. ఏపీ ప్రజలు తమ ఆధార్ ను అప్డేట్ చేసుకున్నారా? లేదా? అన్నది చూసుకోవటంతో పాటు.. అందుకు తగ్గట్లుగా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.