యాపిల్ మ్యాప్స్ చేసిన పనితో ఆ రెస్టారెంట్ కు భారీ నష్టం
పెరుగుతున్న టెక్నాలజీతో లాభాలే కాదు కొన్నిసార్లు నష్టాలు ఎదురవుతుంటాయి. తాజా ఉదంతం ఆ కోవకు చెందింది
By: Tupaki Desk | 28 Jan 2024 12:30 PM GMTపెరుగుతున్న టెక్నాలజీతో లాభాలే కాదు కొన్నిసార్లు నష్టాలు ఎదురవుతుంటాయి. తాజా ఉదంతం ఆ కోవకు చెందింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ప్రజలు వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం చేస్తుంటారు. ఈ క్రమంలో వాటిల్లో దొర్లే తప్పులు.. కొందరికి శాపంగా మారతాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఒక రెస్టారెంట్ విషయంలో ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. బాగా జరిగే ఒక రెస్టారెంట్ కు కస్టమర్లు రావటం బాగా తగ్గించేశారు.
తమవైపు నుంచి ఎలాంటి తప్పు జరగకున్నా.. కస్టమర్లు ఎందుకు రావట్లేదన్నది వారికి అర్థం కాలేదు. చూస్తుండగానే నష్టం అంతకంతకూ పెరుగుతున్న వేళ.. జరిగిన తప్పేమిటో వారికి అర్థమైంది. ఇంతకూ వారు గుర్తించిన తప్పు మరేదో కాదు.. యాపిల్ మ్యాప్స్ తమ పాలిట శాపంగా మారిందన్న విషయాన్ని గుర్తించారు. ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ ప్యాట్ తన భార్యతో కలిసి ''పమ్స్ కిచెన్'' పేరుతో థాయ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు.
అక్కడికి కస్టమర్లు బాగా వస్తుంటారు. మంచిగా వ్యాపారం జరుగుతోంది. అయితే.. యాపిల్ మ్యాప్స్ లో తలెత్తిన లోపం వారికి శాపమైంది. ఆ రెస్టారెంట్ కు కస్టమర్ ఒకరు ఫోన్ చేసి.. మంచిగా జరుగుతున్న హోటల్ ను ఎందుకు మూసేస్తున్నారు? కారణం ఏమిటి? అని అడగటంతో అవాక్కు అయ్యారు. అదేమీ లేదన్న వారి మాటకు.. యాపిల్ మ్యాప్స్ లో సదరు రెస్టారెంట్ పర్మినెంట్ గా మూసేయనున్నట్లుగా చూపిస్తోందని చెప్పటంతో వారికి అసలు విషయం అర్థమైంది.
వారి వద్ద యాపిల్ ఫోన్లు లేకపోవటంతో అసలు సమస్య వారికి అర్థం కాలేదు. విషయం అర్థమైన తర్వాత యాపిల్ సేవల విభాగం ప్రతినిధితో మాట్లాడారు. అయితే.. అందులో తప్పుగా చూపిస్తున్న అంశాన్ని కరెక్టు చేయటానికి.. అప్డేట్ చేయటానికి కాస్తంత ఎక్కువ సమయాన్ని తీసుకున్నారు. దీంతో.. తమకు రూ.6లక్షలకు పైనే నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. యాపిల్ మ్యాప్స్ లో దొర్లిన ఒక తప్పు ఒక రెస్టారెంట్ కు భారీగా ఆర్థిక నష్టాన్ని చేకూర్చిందని చెప్పాలి.