యాపిల్ కు చైనా సెగ... 16 లక్షల కోట్ల రివేంజ్ ఇది!
అవును... హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ ని చంపేసినట్లు ఇప్పుడు అమెరికా – చైనా ల మద్య సాగుతున్న కోల్డ్ వార్ లో యాపిల్ నలిగిపోతుందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 9 Sep 2023 12:30 AM GMTఎదురుపడినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, భుజాలు తట్టుకుని అభినందించుకోవడం, ఫోటోలకు నవ్వుతూ ఫోజులివ్వడం వరకూ బాగానే ఉంటుంది కానీ... లోపల మాత్రం ఒకరిపై ఒకరు కుతకుత లాడిపోతుంటారంటూ కామెంట్లు వినిపిస్తుంటాయి. అవి ఏయే దేశాల గురించి అన్నది తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా - మన పొరుగుదేశం చైనా గురించి! ప్రస్తుతం ఈ దేశాల మధ్య రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే ఈ మధ్యలో యాపిల్ సంస్థ నలిగిపోతుంది.
అవును... హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ ని చంపేసినట్లు ఇప్పుడు అమెరికా – చైనా ల మద్య సాగుతున్న కోల్డ్ వార్ లో యాపిల్ నలిగిపోతుందని తెలుస్తుంది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా షేర్ విలువ పడిపోతుందని, ఇదే సమయంలో యాపిల్ లో పెట్టుబడి పెట్టినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే… ఈ ఏడాది తన మిత్రదేశాలైన జపాన్, నెదర్లాండ్స్ తో కలిసి చైనాకు చిప్ టెక్నాలజీ ఎగుమతులను అమెరికా కంట్రోల్ చేసింది. దీనికి రివేంజ్ గా తమదేశం నుంచి పశ్చిమ దేశాలకు సరఫరా అయ్యే రెండు కీలక పదార్థాల ఎగుమతులను చైనా నిలువరించింది. ఇదే సమయంలో దేశీయ చిప్ పరిశ్రమను బలోపేతం చేయడానికి ఏకంగా 40 బిలియన్ డాలర్లను కేటాయించింది.
ఇదే సమయంలో అగ్రరాజ్యంపై మరింత కక్ష గట్టిన చైనా... తాజాగా ఐఫోన్ - 15 విడుదల నేపథ్యంలో మరో భారీ షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా... సెప్టెంబర్ 12న ఐఫోన్ - 15 విడుదలకు ముందు యాపిల్ పెట్టుబడిదారుల్లో భయాల్ని రేకెత్తించే నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో... యాపిల్ సంస్థ షేర్లు కేవలం రెండు రోజుల్లో 200 బిలియన్ డాలర్ల (రూ.16.63 లక్షల కోట్లు) మేర విలువ కోల్పోయాయి.
దానికి కారణం... ఇటీవల చైనాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్లు సహా ఇతర ఏ విదేశీ బ్రాండ్ ఫోన్లూ వాడొద్దని సూచించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో... త్వరలో ప్రభుత్వ ఆధీనంలోని ఇతర కంపెనీల ఉద్యోగులు కూడా యాపిల్ ఫోన్లను తీసుకురాకూడదని ఆదేశించే అవకాశం ఉందంటూ కథనాలు వెలువడటం మొదలయ్యాయి.
దీంతో యాపిల్ కు ఉన్న అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన చైనా... సుమారు యాపిల్ మొత్తం ఆదాయంలో 18 శాతం ఇచ్చే చైనా... ఉన్నఫలంగా ఇలాంటి నిర్ణయం తీసుకునే సరికి యాపిల్ ఒక్కసారిగా భారీగా 200 బిలియన్ డాలర్ల మేర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
మరోపక్క ఇటీవల చైనాకు చెందిన హువావే సంస్థ అత్యాధునిక మేట్ 60 ప్రో మొబైల్ ఫోన్ ను ఆవిష్కరించింది. దీనిలో చైనా తయారు చేసిన 5జీ కిరిన్ 9000ఎస్ ప్రాసెసర్ ను వాడింది. దీంతో... ఈ పరిణామం చైనా టెక్నాలజీ పరిశ్రమలో మేలిమలుపుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా... ఇది కూడా యాపిల్ షేర్ల పతనానికి కారణమై ఉంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... యాపిల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ ఫాక్స్ కాన్ కు చైనాలో అతిపెద్ద తయారీ యూనిట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వాల్ స్ట్రీట్ లో అతిపెద్ద మార్కెట్ విలువ ఉన్న కంపెనీల్లో యాపిల్ కూడా ఒకటి. దీని మార్కెట్ విలువ సుమారు 2.8 ట్రిలియన్ డాలర్లు!