ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్
అయితే, అతడి అదృష్టం బాగుండి అతడు ధరించిన యాపిల్ వాచ్ క్రాష్ డిటెన్షన్ ఫీచర్ తక్షణమే స్పందించింది.
By: Tupaki Desk | 4 Sep 2023 1:03 PM GMTరోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లేదంటే హఠాత్తుగా గుండెపోటుకు, పక్షవాతానికి గురైనప్పుడు అత్యవసర వైద్య సేవల కోసం గతంలో వేరే వ్యక్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ కు డయల్ చేసే పరిస్థితి కూడా కొన్నిసార్లు బాధితులకు ఉండకపోవచ్చు. ఆ రకంగా సకాలంలో, గోల్డెన్ అవర్ లో వైద్యం అందక ఎంతో మంది మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. అయితే, టెక్నాలజీ పుణ్యమా అంటూ స్మార్ట్ వాచ్ లు, ఫిట్ నెస్ గ్యాడ్జెట్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత అటువంటి ఘటనలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా, కొన్ని స్మార్ట్ వాచ్ లను SOS ఫీచర్ తో రూపొందించారు. అది ధరించిన వ్యక్తి ప్రమాదానికి గురైన వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ కు డయల్ చేసి సకాలంలో వారికి వైద్యసేవలు అందేలా వాటిని డిజైన్ చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఒక డ్రైవర్ ప్రాణాన్ని యాపిల్ వాచ్ నిలబెట్టింది. తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వాహనం డ్రైవర్ గాయపడ్డాడు. అతడు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుకు వంద అడుగుల అవతల తలకిందులుగా పడిపోయింది. దీంతో, అటుగా వెళ్లే వాహనాలు కూడా గుర్తించలేని పరిస్థితిలో అతడు ఉన్నాడు. ప్రమాద తీవ్రతకు ఆ డ్రైవర్ స్పృహతప్పి ప్రాణాపాయ స్థితిలో వాహనంలోనే ఉండిపోయాడు. అయితే, అతడి అదృష్టం బాగుండి అతడు ధరించిన యాపిల్ వాచ్ క్రాష్ డిటెన్షన్ ఫీచర్ తక్షణమే స్పందించింది. ఆ ఫీచర్ ద్వారా వెంటనే 911 ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ వెళ్లడంతో ఎమర్జెన్సీ టెక్నీషియన్ టీం ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుంది.
బాధితుడికి ప్రథమ చికిత్స అందించి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. యాపిల్ వాచ్ వల్లే అతడు బతికి బట్టకట్టాడని, లేదంటే ఘటనా స్థలానికి తాము చేరుకోవడానికి 2 గంటల సమయం పట్టి ఉండేదని రెస్క్యూ టీం సభ్యులు చెబుతున్నారు. గతంలో కూడా యాపిల్ వాచ్ ఇదే తరహాలో ఎస్ ఓ ఎస్ ఫీచర్ ద్వారా ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది.